నామస్మరణ మహత్యం;- : సి.హెచ్.ప్రతాప్
 యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో న చిన్త్యతే
సా హానిస్తన్మహచ్ఛిద్రం సా భ్రాన్తిస్సాచ విక్రియా॥
నిజమైన భక్తులు తమ చుట్టూ వ్యాపించిన దట్టమైన, తీవ్రమైన అగ్నిజ్వాలల మధ్యనైనా ఉండగలరు కాని భగవంతుని స్మరించని  వ్యక్తుల మధ్య నివసించలేరని, దొంగలు సర్వస్వాన్ని దొంగిలిస్తే ఎంత బాధపడుతారో అంతటి బాధను భగవన్నామోచ్చారణకు ఒక క్షణమైనా  చేయలేకపోతే పొందుతారని పరాశరభట్టరు తమ  విష్ణ సహస్రనామ భాష్యంలో పేర్కొన్నారు.
వ్యాస భగవానుడు ఐశ్వరాన్ని కోల్పోయినవారు, దుఃఖితులు, అశక్తులు, శత్రుభయాన్ని పొందినవారు, భయంకరమైన వ్యాధుల బారిన పడినవారు, నిత్యం మానసిక ఆందోళనతో మునిగి తేలేవారు, దరిద్రంలో కొట్టుమిట్టాడేవారు  అందరూ భగవంతుడైన శ్రీమన్నారాయణుని నామాన్ని స్తుతించాలి. ఆ విధంగా స్తుతిస్తే సర్వదుఃఖాలు,సమస్యలు, బాధలు, ఆందోళనలు, అనారోగ్యాలు  తొలగుతాయి. సుఖసంతోషాలతో జీవనాన్ని కొనసాగించ గలుగుతారు అనే విషయాన్ని విష్ణు సహస్రనామస్తోత్ర ఉత్తర పీఠికలోని :

ఆర్తావిషణ్ణా శ్శిథిలాశ్చ భీతాః ఘోరేష చ వ్యాధిష వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖా స్సుఖినోభవంతి॥

అనే శ్లోకం ద్వారా లోకహితకరమైన రీతిలో ఉపదేశాత్మకంగా పేర్కొన్నారు. కలౌ నామ సంకీర్తనమ్ అనే సూక్తి కలియుగంలో భగవంతుని నామస్మరణ వల్లనే ముక్తి కలుగుతుందని తెలుపుచున్నది. అందువల్ల భగవంతునికి ప్రీతికరమైన నామస్మరణ తప్పక చేద్దాం.
నామ జపానికి ఎవరికైనా పరిపూర్ణమైన యోగ్యత లేక పోయినా చుట్టూ నలుగురు పాడుతుంటే మెల్ల మెల్లగా నోరు కదిపి,
మొదట ఇష్టం లేక ప్రారంభం చేసినది కొంతకాలం సాగగా ఇష్టంతో ప్రవర్తించేట్టు చేసి అది ఎంతవరకు వెళ్తుందంటే మొదట భగవంతుని నామాలు విన్నవాడికి ఆ భగవంతుని గురించి కలిగే వాస్తవిక జ్ఞానం వరకు తీసుకెళ్తుంది.
వాక్కు ద్వారా నామజపం చెయ్యటం కంటే మానసిక జపం చేయటం వలన నూరు రెట్లు అధికలాభం కలుగుతుంది అని భగవానుని ఉవాచ.
ఆ మానసిక జపం కూడా అత్యంత ప్రేమ శ్రద్ధ లతో చేసినట్లయితే అది అనంత ఫలప్రదమవుతుంది. 

కామెంట్‌లు