సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -82
తమోదీప న్యాయము
   *****
తమము అనగా కంటికి ఏమీ కనిపించని స్థితి అంటే చీకటని అర్థం.
దీపము అనగా దివ్వె అంటే కాంతిని ఇచ్చే సాధనము.
 తమో దీప న్యాయము అంటే వెలుగు లేని చోట వస్తువులను చూడటానికి దీపం అవసరమనే ఆలోచనా జ్ఞానం కలిగిన వ్యక్తి.చీకటిని అంటే చీకట్లో చూచుటకు దీపము యొక్క సహాయం తీసుకోవడం. ఆ నిశ్చలమైన సంకల్పంతో గొప్ప వాడు అగుట అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీపం ఏం చేస్తుందో అందరికీ తెలుసు. చీకటిని తరిమి కొట్టి తానున్న పరిసరాలను వెలుగులమయం చేస్తుంది.అప్పటి వరకూ చీకటి వల్ల కనబడని వస్తువులను చూసేలా చేస్తుంది. చీకటికి దివ్యమైన ఔషధం వెలుగు మాత్రమే.
దీపాన్ని శాంతికి చిహ్నంగా, కాంతికి, జ్ఞానానికి సంకేతంగా భావిస్తారు.
అజ్ఞనం అనే అంధకారాన్ని తొలగించి  చైతన్యాన్ని ప్రసరింప జేయడం కోసం జ్ఞానమనే వెలుగులోకి పయనించేందుకు దీపాన్ని వెలిగిస్తాం.
బృహదారణ్యకోపనిషత్తులో దీపానికి సంబంధించిన ఈ శ్లోకాన్ని చూద్దాం... "ఓం ,అసతోమా సద్గమయ/ తమసోమా జ్యోతిర్గమయా/ మృత్యోర్మా అమృతం గమయ/ ఓం శాంతి శాంతి శాంతిః!"
అనగా " నన్ను అవాస్తవికం నుండి అసలైన వాస్తవంలోకి నడిపించు, చీకటి నుండి వెలుగులోకి నన్ను నడిపించు, మరణం నుండి అమరత్వం వైపు నడిపించు " అని అర్థం.
 ఒక దీపం చాలు  వందల దీపాలను వెలిగించడానికి.  దీపమనే జ్ఞానము సాయంతో ఎంతో మందిని జ్ఞాన వంతులను చేయవచ్చుననే పరమార్థం ఇందులో దాగి ఉంది.
అందుకే మన పెద్దలు దీపాన్ని దైవత్వానికి ప్రతి రూపంగా చూస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు.
"దీపం జ్యోతి పరం బ్రహ్మం దీపం సర్వ తమోవహం/ దీపేన సాధ్యతే సర్వం/ సంధ్యా దీపం నమోస్తుతే" అర్థం... 
దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపమనీ, దీపం అన్ని రకాల  చీకట్లను తొలగిస్తుందనీ. దీపారాధన అన్నింటినీ సాధించగలదనీ చెబుతూ  నేను ‌సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నానని" చెప్పడమే శ్లోకం యొక్క అర్థం.అందుకే  కొందరు నిత్యం భక్తితో  దీపం వెలిగిస్తుంటారు. 
 అలాగే శుభకార్యాలలోనూ ప్రత్యేక సమయాలలోనూ, ఏవైనా సభల ఆరంభంలోను దీపాన్ని వెలిగిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం.
 తమో దీప న్యాయము ప్రకారం మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకుని అజ్ఞానాన్ని తొలగించుకుందాం. విజ్ఞాన జ్యోతులుగా ప్రకాశిస్తూ సమాజాన్ని చైతన్య రూపంలో కాంతి వంతంగా చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు