కార్పొరేట్‌ సమాధులు;- డా.రామక‌ కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 రెక్కలు తొడుగుతున్న 
పసిమొగ్గలను చిదిమేస్తూ,
చదువు చావులను పరిచయం చేస్తూ,
వ్యాపారమే విద్యకు తార్కాణం చేసేస్తూ,
కార్పొరేట్ నరకాలు అనుభవింజేస్తూ,
సాత్వికమైన బతుకులను అతలాకుతలం గావిస్తూ,
రాక్షస ప్రవృత్తితో అరాచక పనులు జరిపిస్తూ,
భావిపౌరులను బలిచేస్తున్నారు.
విత్తుకుంటున్న మేధో అంకురాలకు,
కార్పొరేట్ సమాధులు కడుతున్నారు.
తల్లిదండ్రులు మేల్కొనకపోతే,
సమాజం ఉద్యమించకపోతే,
నిస్సంతులై నిలబడతారు.
కౌమారం కాంతివిహీనమై,
మెదడు చెదపురుగుల మయమై,
యువత భవిత లేనిదై,
జాతి అభివృద్ధి శూన్యమై
అలమటించక మానదు.
కార్పొరేట్‌ కసాయిలకు కన్నబిడ్డలను అప్పగించకండి.
అంగడిలో బిడ్డలను అమ్మేయకండి.
వివేకమే కవచమై నిలవనీయండి.
గ్రద్ధలకు ఆహారాన్ని ఉచితంగా అందించకండి.
జీవితం కనుమరుగైతే
అంధకారంలో అరణ్యరోదన చేస్తూ జీవచ్ఛవాల్లా బ్రతుకుతారా?
ఇంద్రధనుస్సు బతుకుకు
ప్రాణం పోస్తారా?
కామెంట్‌లు