చిగురాకు మెరుపులలో
ఊయలూగు మంచు ముత్యం
చిరుగాలి తరగలపై
పయనించు సుమగంధం
ఎవరికోసం?
అందాలకోనలో అరవిరిసిన
అడవిమల్లెలసౌరభాల
మకరందపు బిందువులు
ఎవరికోసం?
మది సంద్రపు ఎదలో పొంగే
మమతల కెరటాలపై
తేలి పయనించు
మధువుల నురగలెవరికోసం?
మధుర భావనల మేలుకొలిపి
మౌనరాగాలు ఆలపించు
ప్రసరించు కిరణాల
ప్రణయగీతాలు ఎవరికోసం?
ప్రకృతి కన్నియ పరవశించి
పచ్చదనపు పట్టుపుట్టములు
అణువణువూ ధరియించే
వసంతపు ఆగమనం ఎవరికోసం?
తమకోసం తమ ఆనందంకోసం
స్పందించు సృష్టి మొత్తం.
మనసార ఆ అందాలు
భావించి పరవశిద్దాం ప్రతినిత్యం.
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి