తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 అద్దంలో ముడుపు.
వెనుకటికో లంచగొండి ఆమ్యామ్యా చెల్లిస్తే గాని పనిచేయను అన్నాడట. పనిచేసే పెట్టమన్న వాడు కూడా సామాన్యుడేమీ కాదు. పని అయిన తరువాత ఇస్తానన్నాడట. ఆ అధికారికి అనుమానం కలిగింది. అసలు వీడి దగ్గర డబ్బు ఉన్నదో లేదో అన్న సందేహం కలిగింది. అయితే వారిద్దరూ బేరసారాలు చేసుకుని ఓ ఒప్పందానికి వచ్చారు.
ముడుపు చూపిస్తే నేను నమ్మి నీ పని చేసి పెడతానని అన్నాడు అధికారి. ముడుపు అద్దంలో చూపుతానన్నాడీ ఆ సామి. సరేనన్నాడు అధికారి. అద్దంలో మూడుపు చూసాడట. ముడుపు అంటే మూట ఆ మూటలో ఏముందో విప్పితే గాని తెలియదు. అద్దంలో మూట కనిపిస్తుంది. కానీ దానిలో ఏముందో తెలియదు. చివరకు దాని నీడనే గ్రహించి సరి పెట్టుకోమనవచ్చు. ఈ విషయం ఆ అధికారి అయినా లంచగొండి ఊహించలేకపోయాడు. మొత్తం మీద ముడుపు నిజమో, నీడనో నిర్ణయించలేని స్థితి. అది ఇచ్చేదో ఎగవేసేదో అంతకన్నా తెలియని విషయం.
అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తూ-అందనిది అందుకోవడం కుదరని ఏ విషయమైనా అద్దంలో ముడిపే. అది ఉన్నట్లు కాదు లేనట్లు కాదు. ఇలా అనిశ్చితంగా, బ్రహ్మ పదార్థం లా, అనిర్వచనీయంగా ఉన్నా ఏ విషయాన్నయినా అద్దంలో ముడుపు అని వ్యవహరించడం పరిపాటి అయింది.

కామెంట్‌లు