జీవ వైరుధ్యం;-- :సి.హెచ్.ప్రతాప్

 ప్రపంచంలో వివిధ ఆవాసాల్లో ఉండే వైవిధ్య భరితమైన వృక్షాలు, జంతువులు వాటి వాటి ప్రత్యేక గుణగణాలతో జీవనం సాగించడమే జీవ వైవిధ్యం. ఈ వృక్ష జంతు జాతుల్లో అతి చిన్నవీ ఉండవచ్చు. అతి పెద్దవీ ఉండవచ్చు. ఈ జీవ వైవిధ్యం ఎందుకు అవసరమంటే, పర్యావరణాన్ని సమతులంగా ఉంచడానికే,  మానవాళి మనుగడ కోసమే . మానవుడు ప్రకృతిలో ఓ భాగం గా భగవంతునిచే సృష్టించబడ్డాడు. కానీ తనకు వున్న అపారమైన తెలివితేటలు కారణంగా తాను ప్రకృతికి అతీతమైన వ్యక్తిగా భావిస్తున్నాడు. భూమిపైనున్న జీవులను కాపాడమని ప్రకృతి మనిషికి మిగిలిన ఏ జీవికి లేనన్ని తెలివితేటల్ని ఇచ్చింది. కానీ మనిషి తన తెలివిని అతి తెలివిగా మార్చి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందుకే ప్రకృతి భూకంపాలు, కరువు కాటకాలు, వరదలు, సునామీలు వంటి రూపంలో తన ఉగ్రరూపాన్ని చూపుతూపలు సంధర్భాలలో జాగ్రత్త వహించమని పరోక్షంగా హెచ్చరికలు పంపుతొంది. ఉదాహరణకు తేనెటీగలు దాదాపు లక్షా ముప్పై వేల రకాల మొక్కలలో పరాగ సంపర్కానికి కారణమవుతాయని కనుగొన్నారు. తేనెటీగలు నశించిపోతే చెట్లలో పరాగ సంపర్కం ఆగిపోయి, జీవవైవిధ్యం నాశనమవుతుంది. ప్రసిద్ధ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా.. ‘‘తేనెటీగలు భూమిమీద నశించిపోతే, మానవ జాతి నాలుగేళ్లలో నశించిపోతుంది.’’అన్న విషయాన్ని మానవులందరూ ఆకళింపు చేసుకోవాలి.
అడవిలో ఉండే పులి, కుందేళ్ళు, నక్కలు, జింకలు వంటి అనేక జంతువులను వేటాడి ఆహారంగా గ్రహిస్తుంది. పులే లేకపోతే అడవిలో జంతువుల సంఖ్య పెరిగి, వాటి ఆహారపు అవసరాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల అడవిలోని గడ్డి, చెట్లు, కాయలు, పండ్లు వీటికి ఆహారమవుతాయి. అందువల్ల వాటిని ఆశ్రయించి ఉండే క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తాయి. అడవిలోని జంతువులు, పక్షులు, కీటకాలు పంట పొలాలపై పడితే గనుక మనకు తిండి కూడా దొరకని స్థితి ఏర్పడుతుంది.
జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రధాన కారణం మానవుడే! భూమిపై ఉన్న ప్రతి జీవజాతి మానవునికంటె ముందు ఏర్పడినదే. మానవుడు తన స్వార్థంతో అత్యాశతో ఇతర అన్ని జీవులమీద తన ఆధిపత్యాన్ని సాధించాడు.
జీవ వైవిధ్యాన్ని పెంచడం కోసం బయోడైవర్శిటీ హాట్‌స్పాట్‌లు, బయోస్పియర్ రిజర్వ్, జాతీయ పార్కులు, అభయారణ్యాలు వంటి వాటిని ప్రభుత్వాలు ఏర్పాటుచేసాయి. అయితే ఇది మాత్రమే సరిపోదు. పర్యావరణ రక్షణ మన స్వంత విషయంగా భావించి ప్రతీ ఒక్కరు అందుకోసం కృషి సల్పడం ఎంతో అవసరం.   జీవ శృంఖలం కూడా అంతే. కొన్ని జీవరాసులు నశించినా దాని ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది. పర్యావరణం దెబ్బతిని దుష్ఫలితం మనుషులమీద పడుతుంది. ఒక గొప్ప చారిత్రక కట్టడం ఏ కారణం వల్లలైనా కూలిపోతే మళ్లీ దాన్ని నిర్మించుకోవచ్చు. కానీ, అంతరించి పోయిన వృక్ష, జంతుజాలాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేం. ఏ జీవి అయినా తనకుతానుగా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. తప్పనిసరిగా ఇతర జీవుల మీద ఆధారపడాల్సిందే. ఇదొక శృంఖలం.

కామెంట్‌లు