సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -62
ఘట్ట కుటీ ప్రభాత న్యాయము
*****
ఘట్టం అంటే రేవు తీరము, ప్రదేశము.తీర్థము అని అర్థం. కుటీ అంటే గుడిసె లేదా పాక. ప్రభాతము అంటే ప్రాతః కాలం, ఉషఃకాలము.
ఘట్ట కుటీ తీరము లేదా ఆ ప్రదేశంలో వేసిన గుడిసె లేదా పాక.
మరి ఆ పాక లేదా గుడిసెకు అంత ప్రాధాన్యత ఎందుకు అంటే పూర్వ కాలంలో  రాజుల నగరాలు కోటల మధ్యలో ఉండేవి. వాటికి పెద్ద పెద్ద సింహద్వారాలు ఉండేవి.మనం గోల్కొండ కోట గురించి చదివితే లోపలికి వెళ్ళడానికి ఎనిమిది ద్వారాలు ఉండేవని. అలా వాటి నుండి మాత్రమే నగరంలోకి వెళ్ళాలనీ రాకపోకలు సాగించే వారని తెలుస్తుంది.
అక్కడ బయటి వారు లోపలికి వెళ్ళడానికి పన్నులు వసూలు చేసే  వాళ్ళు, లేదా అధికారులు  ఓ గుడిసె వేసుకొని అక్కడ ఉండేవారు.
లోపలికి ప్రవేశించే సమయంలో  పాక దగ్గర తప్పకుండా పన్ను కట్టవలసి ఉండేది.
వర్తకుల బండ్లను, సామాన్య ప్రజలను ఆపి పన్ను వసూలు చేయడం జరుగుతూ ఉండేది.పూర్వకాలంలో ఇలాంటి  అధునాతన టోల్ గేట్ సదుపాయాలు లేవు కదా!.
అయితే ఓ వ్యాపారికి ఇలా పన్ను కట్టడం ఇష్టం లేదు. దానినెలాగైనా తప్పించుకోవాలని రాత్రి పూట ప్రయాణం చేస్తాడు.అక్కడ  బండి ఘాటీ లేదా ఘట్ట కుటీ దగ్గర నుండి వెళితే  పన్ను కట్టవలసి వస్తుందని  అర్థ రాత్రి వేళ  వేరే దారిలో వెళ్ళేందుకు ప్రయత్నిస్తాడు.ఆ ప్రయత్నంలో సందులు గొందులు తిరుగుతాడు. దారి తప్పి  దురదృష్టం కొద్దీ చివరికి  ఆ ఘాటీ దగ్గరకే  వస్తాడు.అలా వచ్చే టప్పటికి తెల్లవారుతుంది.అంటే ప్రభాతం అవుతుంది.
దీని వల్ల అతనికి అనవసర శ్రమతో పాటు పన్ను కూడా కట్టక తప్పలేదు.
ముందే నేరుగా అక్కడ నుండి వెళ్తూ పన్ను కడితే బాగుండేది. పన్ను నుండి తప్పించుకోవడానికి చేసిన విశ్వప్రయత్నం వృధా అయ్యింది కదా!.
దీనినే తెలుగులో "లోభికి ఇమ్మడి ఖర్చు" అని  కూడా అంటారు.దీనికి సంబంధించిన ఓ కథ మనందరికీ తెలిసిందే.
ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు.అతడు పరమ లోభి.వట్టి ఆశపోతు.పైసలు బాగా కూడబెట్టాలనే ఆశతో కల్తీ నెయ్యి అమ్మేవాడు.
 ఒకసారి ఆ ఊరిలోని ఓ పెద్ద మనిషి తమ ఇంట్లో పెళ్లి కోసం ధనయ్య దగ్గర నెయ్యి కొన్నాడు.ఆ నెయ్యితో చేసిన పిండి వంటలు తిన్న చుట్టాలందరికీ వాంతులు అయ్యాయి. దీనికి కారణం ధనయ్య సరఫరా చేసిన కల్తీ నెయ్యి అని తెలుస్తుంది.
 
వెంటనే ఆ పెద్ద మనిషి పంచాయతీ పెట్టిస్తాడు.ధనయ్య నేతిని కల్తీ చేశాడని ఋజువు అవుతుంది.ధనయ్య చేసిన తప్పుకు గ్రామాధికారి శిక్ష విధిస్తాడు. 
వెయ్యి వరహాలు జరిమానా కట్టమంటాడు. అంత డబ్బు కట్టలేను మరేదైనా శిక్ష వేయండి అంటాడు సరే.'వంద కొరడా దెబ్బలు తినాలి' అంటారు.'అన్ని దెబ్బలు తినలేను మరేదైనా శిక్ష వేయండి' అంటాడు. 'మణుగు నెయ్యి తాగమని' చెబుతారు.చివరి దానికి ధనయ్య ఆనందంగా ఒప్పుకుంటాడు.
 కొంచెం నెయ్యి తాగేసరికి కడుపులో ఎలాగో అయిపోయి,దెబ్బలే నయం అనుకుని కొరడా దెబ్బలు తినడానికి ముందుకు వస్తాడు.
 అందులో సగం దెబ్బలు తినేసరికి ఒళ్ళంతా వాతలు నొప్పులు.ఆ దెబ్బలు భరించలేక లబలబలాడుతూ వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ వెళతాడు.
ముందే తప్పు చేయకుండా ఉంటే బాగుండేది.చేసిన తప్పు ఒప్పుకుని జరిమానా కడితే ఇన్ని రకాలుగా బాధలు ఉండేవి కాదు కదా!.ఇలాంటి వారికి సంబంధించినదే  ఈ ఘట్ట కుటీ ప్రభాత న్యాయం.
ఇలాంటి  మనస్తత్వం కలిగిన వ్యక్తులు మనకు నిత్య జీవితంలో అక్కడక్కడా కనబడుతూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి న్యాయాలు. లోకోక్తులు గుర్తుకు వస్తాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం