మహిళ -డా.అడిగొప్పుల సదయ్య
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...
+++++++++++++++++++++++++++++++++
సీస మాలిక:
రుద్రమ్మవై యుద్ధ రుద్రభూమిన చెలగి
రుధిర జ్వాలల హేలి రువ్వినావు...

కల్పనా చావ్లవై కదలి రోదసి చేరి
విశ్వాంగ మర్మాల విచ్చినావు...

సావిత్రిబాయివై సతులకై బడులను
తెగువతో పోరాడి తెరచినావు...

ఐలమ్మవై గడీ తాళమ్ములను కొట్టి
నిప్పులా దొర గుండె నిండినావు...

మాంచాలవై రేపి మగని సిద్ధము జేసి
పలనాటి పోరుకై పంపినావు...

భరత కోకిలవయ్యి "బంగారు గడప"ను
భవ్యంపు గీతాలు పాడినావు...

మణికర్ణికాంబవై మర్లబడి తెల్లోడి
దర్పదాష్టీకాల దంచినావు...

మొల్లవై "చంపు"లో మోదకావ్యము రాసి
సూర్యవంశపు రాజు జూపినావు...

విద్యాధినేత్రీవె విపుల శాస్త్రజ్ఞీవె
శక్తి ప్రదాతీవె శక్తి నీవె...

సకల సంపదలిచ్చి జనసంచయము గాచు
లక్ష్మీవె సర్వుల లక్ష్యమీవె...

నన్ కన్న తల్లీవె, నే కన్న తల్లీవె
నా తోడబుట్టీవె నాతి నీవె...

స్థితి నీవు, గతి నీవు, క్షితి లాంటి మతి నీవు
ఎత నీవు, జత నీవు,ఎల్ల నీవు

ఆ.వె.
కరుణ మూర్తి నీవె,కామధేనువు నీవె
కడలి నీవె, జనని గంగ నీవె
కల్ప తరువు నీవె,కంజాత వల్లీవె
కనక నగము నీవె, కాలమీవె...

===================
డా.అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట,కరీంనగర్
9963991125


కామెంట్‌లు