ఉత్తమ కవి స్థానం ప్రజాహృదయాల్లో -తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి
 ఉత్తమకవి ప్రజాహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడని  తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు నిర్వహణలో రవీంద్రభారతిలో జరిపిన సాహిత్య తరగతిలో ఆయన ప్రధానవక్తగా ప్రసంగించారు. 'కవిత్వ రచన-మౌలికాంశాలు' అనే అంశంపై ప్రముఖ కవి డా. అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సాహిత్య తరగతి నిర్వహించారు. కొత్తగా ఆలోచించడం కవికి తప్పనిసరి అని సిధారెడ్డి సూచించారు. విభిన్నంగా చెప్పగలగడం ఉత్తమ కవికి ఉండే సుగుణంగా ఆయన పేర్కొన్నారు. వస్తువు, శిల్పం కవిత్వానికి అత్యంత ప్రధానమైనవని  ఆయన  చెప్పారు. 
కవులు అధ్యయనాన్ని వీడకూడదని సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు చౌడారపు శ్రీధర్ అన్నారు. సమకాలీన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. 
కవులు రాజ్యంలో ఉండకూడదని పేర్కొన్న కాలం నుండి కవిత్వం నేటివరకు పురోగమన పథంలో సాగిందని సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, విమర్శకులు, కాళోజీ అవార్డు గ్రహీత డా. అమ్మంగి వేణుగోపాల్ అన్నారు. కవిత్వంపై వివిధ తత్వవేత్తల అభిప్రాయాలను ఆయన సోదాహరణంగా వివరించారు. సృజనను నిరంతరం కొనసాగించాలని ఆత్మీయ అతిథి, పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు పి. సరోజినీదేవి కవులకు సూచించారు. అభ్యాసం వల్లే ఉన్నత స్థితికి చేరగలుగుతారని ఆమె పేర్కొన్నారు. 
దర్పణం సాహిత్య వేదిక కవులతో ప్రతిరోజూ ఒక అంశంపై కవిత్వం రాయించి, అభ్యాసానికి వీలుకల్పిస్తోందని ఆ సంస్థ అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు చెప్పారు.  సాహిత్యంపై అవగాహనం కల్పించేందుకు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పి. వి. సత్యమూర్తి, రామకృష్ణ చంద్రమౌళి, గుర్రాల వేంకటేశ్వర్లు కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. జాలిగామ నరసింహారావు, జె. వి. కుమార్, నక్క హరికృష్ణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కవిసమ్మేళనంలో గిర్మాజి దామోదర్, సాదనాల వెంకటస్వామి నాయుడు, సత్యవీణ మొండ్రేటి, కోదాటి అరుణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
దర్పణం వేదిక సాహిత్యానికి పెద్ద పీట వేసి ప్రముఖులతో ఉపన్యాసాలు ఇప్పించడం ముదావహం!