సుప్రభాత కవిత ; -బృంద
గుండె చాటు ఊహలకు
రెక్కలొచ్చినట్టు...
తేలికగా పాలమబ్బు
తేలిపోతోంది

తొలగిపోక తప్పనిసరై
తచ్చాడిన చీకటి కాస్తా
తెలి వెలుగుల దొంతరలో
తనను తానే దాచుకుంది

మమతల పండించు
మయూఖపు స్పర్శకు
మంచుపొరలు కరిగిపోగా
కొండ మనసు పొంగిపోయింది

పైరగాలులు పంచుతూ
పసిడి పంటలిచ్చు పొలాలన్నీ
పచ్చని చీరకట్థి ముస్తాబై
ప్రభువు రాకకై పలవరిస్తోంది

ముళ్ళ మొక్కలకు పూసిన
ముద్దైన పువ్వులు
శిలలమధ్య  చిరునవ్వులు
పంచుతూ..నిరీక్షిస్తున్నాయి

ప్రకృతి కాంతకెంత పరవశమో
పరమాత్ముని దర్శించ...
మనకు మనసు లేదేమిటో
కాలంతో పరుగులు తప్ప!

నమస్కారమిస్తే సమస్త సంపదలూ
ఇచ్చే దినకరుడికి మనస్ఫూర్తిగా

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు