సుప్రభాత కవిత ; - బృంద
పొద్దుపొడిచే వేళ
ముచ్చటగ రేకులు విప్పే
కమలానికెంత ఆరాటమో!

అరుణోదయవేళ
అందమైన రంగులు నింపుకుని 
వేచే అంబరానికెంత సంబరమో!

ఉషోదయ వేళ 
జగతిని మేలుకొలుపు  
గువ్వలకెంత సంతోషమో!

భానూదయ వేళ
భాసురముగ వెలిగిపోయే
ఇనబింబముదెంత  అందమో!

సూర్యోదయ వేళ
సరిగమలు పాడుతూ
గలగలా సాగే ఏటిదెంత వేగమో?

ప్రభాత వేళ 
ప్రభవించు ప్రభాకరుని
కిరణాలదెంత సౌందర్యమో!

శుభోదయ వేళ
శుభాలు పంచుతూ
కిరణాల స్పర్శ ఎంత శుభకరమో!

తొలిసంధ్య వేళ
తిమిరాలు తొలగించు
ఆది దేవుని దెంత అనుగ్రహమో!

తొలిపొద్దు వేళ
మనసును పొంగించు
భావనల దెంత ఆహ్లాదమో!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు