అవయవదానం;- సి.హెచ్.ప్రతాప్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్న అబ్బిడిపల్లిలో 542 మంది నివాసం వుంటున్నారు. కుగ్రామమే అయినా అయినా ఊరివాళ్ల ఆలోచన మాత్రం పెద్దది. ఊళ్లో ఉన్న 421 మంది ఓటర్లంతా కలిసి ‘చనిపోయిన తర్వాత అవయవ దానం చేస్తామ’ని గ్రామపంచాయితీలో తీర్మానం చేశారు. అవయవదానం చేయడం ద్వారా మనిషి భౌతికంగా లేకపోయినా అతని అవయవాలు బతికే ఉంటాయని, అలా ఒక వ్యక్తి ఎంతోమందిలో బతికే ఉంటాడని అక్కడి వాళ్లు చెప్తున్నారు.
అవయవదానం పై ఈ మధ్యకాలంలో స్పృహ  పెరుగుతోంది. చాలామంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాగే అవయవదానంపై కొంతమందిలో అపోహలు కూడా ఉన్నాయి. అవయవాలను దానం చేయకూడదని కొంతమంది నమ్ముతుంటారు. ఇలాంటి  అనుమానాలను పోగొడుతూ కొన్ని ఫౌండేషన్లు జనాల్లో అవగాహన కల్పిస్తుండదం మంచి పరిణామం. ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం.
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు.కళ్ళు,గుండె,కాలేయం,మూత్రపిండాలు,ఊపిరితిత్తులు,క్లోమం,పెద్ద,చిన్నపేగులు,ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది.  వయవదానం చేయడానికి స్పెయిన్ లో లక్షకు 35 మంది, అమెరికాలో 26 మంది..ఆస్ట్రేలియాలో 11 మంది చొప్పున అంగీకారం తెలిపారు..కానీ మన దేశంలో.. లక్షకు కాదు కదా…10 లక్షల మందిలో కూడా ఒకరు లేరు..మనిషి చనిపోయాక తనతోపాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అదే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాతా జీవించవచ్చు.
బతికుండానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మానాన్న, సోదరి, పాప, బాబు, భార్య . ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు.బతికుండానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి.ఆరోగ్యవంతులైన అన్ని వయసులవారు అవయవదానానికి అర్హులే. తన మరణాంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు. 

కామెంట్‌లు