సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -68
చాతకీ జీమూత న్యాయము
******
చాతకము  అనేది ఒక పక్షి.దానికి వాన కోయిల ,స్తోకకము, వాన నెచ్చెలి అనే పేర్లు కూడా ఉన్నాయి.
జీమూతము అంటే కొండ,మబ్బు, మేఘము,నీరదము,వారిదము,తోయదము అనే అర్థాలు ఉన్నాయి.
ప్రపంచ మంతటా అంటే ఈ భూమి మొత్తం మీద జలము/ నీరు అనేక చోట్ల లభించినప్పటికీ ఈ చాతక పక్షి మాత్రం  మేఘాలు కురిపించే వాన చినుకులు మాత్రమే తాగి దాహం తీర్చుకుంటుంది.నదులు, సరస్సులు మొదలైన వాటిల్లో ఎంత స్వచ్ఛమైన నీరు దొరికినా ఆ నీరు మలినమైనది,కలుషితమైనదనే భావనతో అస్సలు తాగదట. భలే వింతగా అనిపించినా ఇది నిజమని అంటున్నారు.
భారత దేశంలో కొల్లేరు సరస్సు సమీపంలో ఈ చాతక పక్షులు సంచరిస్తూ ఉన్నాయని అంటున్నారు.
ఈ పక్షి వర్షం పడేటప్పుడు  నోరు తెరిచి ఆ వాన చినుకుల్ని అలా నేరుగా తాగుతుందట.
తొలకరి జల్లుల చినుకుల్ని ఇష్టంగా తాగుతుందని, మళ్ళీ తొలకరి వచ్చేంత వరకు సడలని దీక్షతో ఎదురు చూస్తూ ఉంటుందనీ, తక్కిన ఋతువులలో అంటే వర్షం పడని కాలంలో దాహం ఎంతగా అవుతున్నా ఏ నీళ్ళూ తాగకుండా అలాగే  ఉండిపోతుందట.
అందుకే కవులు రచయితలు తమ రచనల్లో,కావ్యాల్లో చాతక పక్షిని కఠోర నియమానికి,ఓర్పుకు ప్రతీకగా ఉదహరిస్తుంటారు.
చాతక పక్షిలా మనుషులు మోక్ష ప్రాప్తి కోసమో,తమకు ఇష్టమైన వ్యక్తి కోసమో, మరింకేదైనా లక్ష్య సిద్ధి కోసమో  ఓర్పు, సహనం అంతకు మించిన నమ్మకంతో దీక్షగా  ఎదురు చూసేవారిని చాతక పక్షులతో పోలుస్తారు.
'రామ చరిత మానస్' మరియు 'హనుమాన్ చాలీసా'ను రాసిన తులసీ దాస్ 'నాకు కేవలం రాముడి మీదనే నమ్మకం.రాముడే నా బలం.రాముడి అనుగ్రహమే నాకు ఆధారం.ఘన శ్యాముడైన రాముని వాత్సల్య వృష్టి కోసం ఎదురు తెన్నులు చూసే చాతక పక్షిని నేను" అంటాడు. 
తనకు రామునిపై గల అనన్య భక్తిని వెల్లడిస్తూ   "ముఝే భరోసో ఏక్ బల్, ఏక్ ఆస్ విశ్వాస్!
ఏక్ రామ్ ఘనశ్యామ్ హిత్ చాతక్ తులసీదాస్!!"అని ఓ దోహాలో అంటాడు.
 ఏది ఏమైనా  అకుంఠిత దీక్షకు, అమేయమైన ఓర్పు, సహనానికి,సాధించ గలననే నమ్మకానికి మారుపేరుగా ఈ చాతకీ జీమూత న్యాయమును ఎలాంటి సందేహమూ లేకుండా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కదా! .
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు