సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -75
జాల మత్స్య న్యాయము
******
జాలము అంటే వల. మత్స్యము అంటే చేప.
వలలో చిక్కుకున్న చేప  వలలో నుండి బయట ప్రపంచాన్ని మొత్తం చూడగలదు.కానీ బయటకు రాలేదు.
దీనినే జాల మత్స్య న్యాయము అంటారు.
ఈ న్యాయము నేటి యువతకు సరిగ్గా సరిపోతుంది.
భక్త రామదాసుగా పిలువబడిన కంచెర్ల గోపన్న రాసిన దాశరథి శతకంలోని ఈ పద్యాన్ని చూద్దాం.
వనకరి చిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా/ వినికిని జిక్కె జిల్వ కనువేదురు జెందెను లేళ్ళు తావిలో/ మనికి నశించె దేటి తరమా యిరుమూటిని గెల్వ నైదు సా/ ధనముల నీవె కావదగు దాశరథీ కరుణా పయోనిధీ!
ఏనుగు శరీర దురదతోనూ ,చేప జిహ్వ చాపల్యంతోనూ,పాము నాగస్వరం వినడంతోనూ, జింక తనకు కనిపించిన దానిని అనుసరిస్తూ,తుమ్మెద తామర పువ్వు లోని వాసనకు ఆకర్షితమై ప్రమాదంలో చిక్కుకుంటాయి. స్పర్శ, రుచి,వినికిడి,వాసన,చూపు... ఈ ఐదు పంచేంద్రియాలను నిగ్రహించుకోకపోతే పై వాటిలా ప్రమాదంలో చిక్కుకోక తప్పదు.వీటిని గెలవడం అంత సాధ్యమైన పని కాదని తన ఇష్ట దైవం అయిన శ్రీరాముడే వాటి నుంచి రక్షించగలడని నమ్మకంతో ప్రార్థిస్తూ రాసిన పద్యం ఇది.
జాలరి వలకు  చిక్కుకున్న  చేపలా, పంచేంద్రియాల వలలో చిక్కుకుని బయటికి రాలేక పోతున్న వివిధ జంతువుల్లా,అంతర్జాల మాయాజాలంలో చిక్కుకున్న యువత కూడా బయటికి రాలేక ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇవి ముఖ్యంగా  శారీరక, మానసిక,సామాజిక, నైతిక పరమైన సమస్యలు.ఇవి కేవలం సమస్యలు అయితే వాటికి సమాధానాలు ఉంటాయి. ఎలాగోలా పరిష్కరించుకోగలం. కానీ నేడవి సవాళ్ళుగా మారాయి.
యువత ఒక్క సారి ఆ మాయా జాలంలో చిక్కుకున్న తర్వాత తమ తప్పు తాము తెలుసుకున్నా బయటికి రాలేని స్థితి ఉంది.
పరిస్థితులు చేయి దాటకముందే  జాగ్రత్త పడాలి.ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి.అప్పుడే జాల మత్స్య న్యాయం నుండి బయట పడవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు