పిరమిడ్లు;- తెలుగు భాషోపాధ్యాయుడు. ప్రొద్దుటూరు. కడప జిల్లా. ఆంధ్ర ప్రదేశ్.9440703716

  పిరమిడ్లు అనేవి ఈజిప్టులోని భారీ రాతిసమాధులు. వీటి మట్టం చదరంగా ఉంటుంది. నాలుగు త్రిభుజ పార్శాలు ఉంటాయి. అవి పైన కోణంగా కలుస్తాయి. అవి ఒక్కొక్కటి మరో పెద్ద సముదాయంలో భాగం. ఆ సముదాయంలో నైలు దగ్గర దేవాలయం ఉంటుంది. దీనికీ ఆ పిరమిడ్ కి మధ్య కాలువ ఉంటుంది. అవి ఒక్కొక్కటి ఓ మృత మందిరం.
    ఆనాటి రాజులను ఫారోలని పిలిచేవారు. ఏ ఫారో (రాజు) అయినా మృతి చెందితే ఆమృత కాయాన్ని పెద్ద కొయ్యపడవలో నైలునది మీద ఆ మైదాన దేవాలయానికి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఆ కాలువ మీద పిరమిడ్ లోపలికి శాశ్వత విశ్రాంతి స్థాపరానికి తీసుకు వెళ్లేవారు. ఓ పెద్ద పడవని ఆ పిరమిడ్ పక్కన భూస్థాపితం చేసేవారు. ఈజిప్టు వాసులు మృతి చెందిన ఫారోకి పుష్కలంగా బట్టలు తొడిగేవారు. ఆహారము, నగలు, కుర్చీలు, బల్లలు, సింహాసనం, సుగంధ ద్రవ్యాలు, ఆయుధాలు, పానీయాల వంటివి అన్నీ మృతదేహంతో ఉంచేవారు. 
   గజాలో మహా పిరమిడ్ ఉంది. దానిలోని ఒక్కొక్క బండ 2.5 టన్నుల బరువుతో ఉంటుంది. దాన్ని ఎత్తడానికి ఎనిమిది మంది అవసరమైన రెండు మిలియన్ల గ్రానైట్ బండలు దాని నిర్మాణంలో ఉన్నాయి. ఈ రాతిని ఎగువ ఈజిప్టులో త్రవ్వారు . నైలు నది మీద 700 మైళ్ళ దిగువకు రవాణా చేశారు. వేలాది మంది మనుషులు 20 ఏళ్ల పాటు ఈ కట్టడంలో నిమగ్నమయ్యారు. 
ఈజిప్టువాసులు ఫారోని ఒక పవిత్రమూర్తిగాను, దైవాంశ సంభూతుడిగాను భావించేవారు. మృతరాజుల గౌరవ సంస్కారం కోసం ప్రతి పిరమిడ్ నందలి మృత ఫారోల ఆరాధనలో నిమగ్నమై ఉండే పూజారులకు కొంత భూమిని దానం ఇచ్చేవారు.
   పిరమిడ్లు చక్కని శిల్పకళకు,చిత్రకళకు శిల్పుల పనితనానికి ప్రతిబింబాలు. పిరమిడ్లను కట్టునప్పుడు రాళ్ళను కోయుటకు వజ్రములు తాపిన కంచు రంపములు వాడేవారట. పిరమిడ్ల వైశాల్యం, ఘనపరిమానము, వేల కొలది యేండ్లం నిలిచి ఉండుట, అపూర్వ నిర్మాణ కౌశలము,ఎండవానలకు తట్టుకొని ఈనాటికీ మహోన్నతంగా, మహోద్బుతంగా నిలిచి ఉన్న ఈ నిర్మాణాలు చాలా విచిత్రమైనవి. ప్రపంచ ఏడు వింతల్లో ఈ పిరమిడ్స్ చెప్పుకోదగిన నిర్మాణాలు.
డి.కె.చదువులబాబు.

కామెంట్‌లు