తెలుగు నాటకరంగం విశేషాలు .;- డా.బెల్లంకొండనాగేశ్వరరావు. 9884429899.
 ఆధునిక ఆంధ్రనాటకం 1860 లో రచింపబడినప్పటికి,ఏ ఒక్కనాటకమూ ప్రదర్శనయోగ్యంగా లేదు.(అప్పటికి సంస్కృత,హిందీ నాటకాలే ప్రదర్శింపబడుతుండేవి.)అనతరం 1880 ఏప్రెల్ 16 తెలుగు నాటకరంగం తొలిసారి తెరలేచినరోజు.యాధృచ్పికంగా అదేరోజు కందుకూరివీరేశలింగం గారి పుట్టినరోజు కావడం విషేషం.
కందుకూరివారే విద్యార్ధి నాటక సమాజాన్ని స్ధాపించి వారి రచనలే ప్రదర్శించడంవలన వారే ప్రధమాంధ్రా నాటక రచయితగా,ప్రయోక్తగా గుర్తింపబడ్డారు.
మొదట నాటక ఆవిర్బవానికి దోహదం చేసినవారిలో ధార్వాడ నాటక సమాజం వారిని చెప్పుకోవాలి.వారు గోదావరి,కృష్ణాజిల్లాలలో పర్యటించి -అప్పటివరకు వాడుకలోఉన్న కాగడాలు,మేకప్ లో ఉపయోగించే చెక్కనగలకు స్వస్తి పలకడం జరిగింది.అందమైన గాజుదీపాలు, మొడలోహారాలు,చెమ్కిలు,రంగస్ధలంపై తెరలు,పక్కతెరలు కట్టడం ప్రారంభమైనది.ధార్వాడ సమాజంవారు రాజమండ్రి వచ్చి హిందీ నాటక  ప్రదర్శన ఇచ్చిన,పాక వేదికపైనే,కందుకూరివారు రత్నావళి (హర్షుని సంస్కృత నాటకానికి తెలుగు అనువాదం)-చమత్కారత్నావళి (షేక్సిఫియర్ ఇంగ్లీషు నాటకం 'కామిడి ఆఫ్ ఎర్రర్స్ 'కు తెలుగు అనువాదం)ఈ రెండు నాటకాలు తమబృందంతో ప్రదర్శించారు.తొలినాటక సమాజాన్ని స్ధాపించినదికూడా కందుకూరివారే. దర్శకుడు,మరియు వీరు సంఘ సంస్కర్తగా,రచయిత, కవి, పండితుడుగా బహుముఖ సేవలు  అందించారు.అలా ఆంధ్రదేశం అంతటా నాటక సమాజాలు మొదలయ్యాయి.గుంటూరులో గుంటూరు హిందూ నాటక సమాజం ప్రారంభమైయింది.అనేకపట్టణాలలో సంచరించి ప్రదర్శనలు ఇచ్చిన తొలినాటక సమాజం ఇదే!
1886 లో ఆంధ్రనాటక పితామహునిగా గౌరవింపబడిన శ్రీధర్మవరపు రామకృష్ణాచార్యులుగారు బళ్ళారి పట్టణంలో నాటకసమాజం నెలకొల్పి చిత్రనళినీయం-విషాద సారంగధర ఆదిగాగల నాటక ప్రదర్శనా విధానాలలో మార్పులుచేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు.ఆపద్ధతినే మిగిలిన నాటక సమాజాలు అనుసరించాయి.
అనంతరం 1889 లో టంగుటూరిప్రకాశం పంతులుగారు,ఇమ్మినేని హనుమంతురావునాయుడు కలసి హిందూ నాటక సమాజాన్ని స్ధాపించి చిలకమర్తిలక్ష్మినరసింహం పంతులు గారి రచనలు ప్రదర్శిస్తూ వచ్చారు.
అనంతరం సంభంధం మొదిలియార్ గారు మద్రాసులో1/7/1891వ తేదిన 'సుగుణవిలాససభ' అనేసంస్ధను స్ధాపించి వరుసనాటకాలను ప్రదర్శించడం ప్రారంభించారు.చందాలకేశవదాసు గారి రచన 'పరాబ్రహ్మ పరమేశ్వర' గీతాన్ని రాయగా,శ్రీపాపట్లకాంతయ్యగారు బాణీలుకట్టగా, నాటక ప్రారంభంలో ప్రార్ధనా గీతంగా నాటినుండి పాడటం ప్రారంభించారు. రెండవ స్ధానంగానే కందుకూరివారి సంస్ధను చెప్పుకునేవారు.మొదటి స్ధానం 'జగన్నాధవిలాసినిసభ'వీరు సంస్కృతనాటకాలనే ప్రదర్శించారు.
1860 లో మోదటి స్వాతంత్ర తెలుగు నాటకం 'మంజరీ మధుకరీయం' రచన తొలితెలుగు నాటకకర్త శ్రీకొరాడ రామచంద్రశాస్త్రి.
1871 లో సంస్కృత నాటకానికి తొలి అనువాద తెలుగు నాటకం'నరకాసుర విజయ వ్యాయోగము'అనే నాటకం.శ్రీ కొక్కొండవెంకటరత్నం పంతులు గారి రచన ఇది.తెలుగులో అచ్చుఅయిన తొలి నాటకం కూడాఇదే. శ్రీవారణాసి ధర్మసూరి గారి సంస్కృత నాటకానికి ఇది తొలి అనువాదం.
1875లో ఇంగ్లీషు నాటకానికి తొలితెలుగు నాటక అనువాదం 'సీజరు చరిత్ర'అనేనాటకం శ్రీవావిలాల వాసుదేవశాస్త్రి'రచించారు.షేక్స్ ఫియర్ నాటకానికి ఇది తెలుగు అను వాదం.తేటగీతి పద్యాలతో రచించి, పద్య నాటకాన్ని రాసిన ప్రధములు గుర్తింపుపొందారు.
1880లో తొలి సాంఘీక వచనా నాటకం 'మనోరమ'శ్రీ అచంటవెంకటరాయ సాంఖ్యాయన శర్మ'రచించారు.ఇదే సంవత్సరం తొలి స్వాతంత్ర సాంఘీక పద్యనాటకం'నందకరాజ్యం'రచించిన నాటకకర్త శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి.మొదటి సాంఘీక పద్యనాటకం ఇది.దీన్ని నాటకంలో అంతర్నాటకంగా ప్రవేశపెట్టారు.
గురజాడవారివారి మొదటి సాంఘీక సంఘ సంస్కరణాత్మకమైన 'కన్యాసుల్కం'1892 లో ప్రదర్శింపబడింది.1897 లో ప్రచురితం జరిగింది.
1902 లో బళ్ళారిలో 'సుమనోహరసభ'అనే నాటకసమాజం వెలసింది. దీన్నిఆంధ్ర చారిత్రిక నాటక పితామీహు లైన కోలాచలం శ్రీనివాసరావు, బళ్ళారి రాఘవగార్లు నిర్వహించారు.అనంతరం వీరు'వాణీవిలాసం'అనే నాటక ప్రదర్శనశాలను నిర్మించారు.
అదేసమయంలో బందరులో తొలి నాటక పోటీలు జరిగాయి.అలా తెలుగు నేల అంతటా నాటక పోటీలు జరపడం పరిపాటి అయింది.పాండవోద్యోగ విజయం,కురుక్షేత్రం,గయోపాఖ్యానం,హరిశ్చంద్ర,చింతిమణి మొదలగు నాటకాలు విరివిగా ప్రదర్శింపబడసాగాయి.నాటకరంగంలో కాంట్రాక్టర్లు ప్రవేసించారు. ఇద్దరు కృష్ణులు,ముగ్గురు అర్జునులు నాటకంలో పుట్టుకువచ్చారు. ఇదేసమయంలో పలువురు కళాకారులు వేదికనుండి వెండితెరకువెళ్ళిపోయారు.నాటకరంగంలొ మందగమనం సాగింది.
ధర్మవరపు కృష్ణమాచార్యులు గారు రాసిన 'భక్తప్రహ్లాద'పౌరాణిక నాటకాన్ని సురభి నాటక సంస్ధ కళాకారులను బొంబాయి తీసుకువెళ్ళిన హెచ్.ఎం.రెడ్డి నాటకాన్ని యధాతదంగా వెండితెరకు ఎక్కించారు.ఇది 1931సెప్టెంబర్ 15 నవిడుదల అయింది.ఇదే తొలి తెలుగు టాకీసినిమా.
1929 లోనాటకరంగం పరిషత్తులు పురుధ్ధింపబడినవి. పనరస గోవిందరావు గారు సురభి నాటక సంస్ధను ఎంతో నేర్పుగా తీర్చిదిద్దారు.అదేసమయంలో పౌరాణిక,చారిత్రిక నాటకాలతోపాటు పలునాటకాలు సమకాలిన సమస్యలపై సాంఘీక నాటకాలు ఎన్నో పుట్టుకువచ్చాయి. సందేశాత్మక 'రక్తకన్నిరు'నాటకం మన అందరికితెలిసిందే.ఇలా ఎన్నో గొప్ప నాటకాలు తెలుగునేలపై వర్ధిల్లాయి.ఈనాటకరంగానికి 'ప్రజానాట్యమండలి'వారు ఎనలేని సేవలు అందిస్తూ సమాజన్ని మేలుకొల్పడంలో ప్రముఖ పాత్రవహించిందని చెప్పుకోవాలి.నేటికి ఎన్నో ఒడుదుడుకులను నాటకరంగం ఎదుర్కొంటూనే ఉంది.ఎందరో మహనీయుల కళారంగ పోరాటం నేటియువతగుర్తించి,వారి ఆశయాలను మనదైన నాటకకళను కాపాడుకోవలసిన బాధ్యత మనతెలుగు యువతదే!

కామెంట్‌లు