మాటిచ్చే ముందు ఆలోచించాలి;- - జయా
 అది శీతాకాలం రాత్రి. చలి ఎక్కువగా ఉంది. దానికి తోడు చల్లగాలి.
ఓ ధనవంతుడు ఇంటి సమీపంలో ఒక వృద్ధ పేదవాడిని కలుసుకున్నాడు. 
ధనవంతుడు అతనితో "ఎలా భరిస్తున్నావు ఈ చలిని?" అని అడిగాడు.  
అప్పుడా వృద్ధుడు, "నాకెక్కడిదయ్యా కోటు? ఎండా వానా చలీ గిలీ దేనికైనా మాలాంటివాళ్ళు అలవాటు పడిపోవాల్సిందే" అని జవాబిచ్చాడు. 
వెంటనే కోటీశ్వరుడు, "ఇప్పుడే వస్తాను. ఇంట్లోకెళ్ళి నీకొక కోటు తీసుకొస్తాను. వేసుకో. వెచ్చగా ఉంటుంది ఈ చలికి" అన్నాడు.
అతని మాటలకు పేదవాడెంతో సంతోషించాడు.
ఇంట్లోకి వెళ్ళిన ధధవంతుడికోసం నిరీక్షించాడు.
తీరా ఇంట్లోకి వెళ్ళిన ధనవంతుడు పనిలో పడి పేదవాడి సంగతి మరిచిపోయాడు. 
అయితే మరుసటిరోజు ఉదయం అతనికి  పేద వృద్ధుడికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది.
వెంటనే ఓ కోటుతో అతనికోసం బయలుదేరాడు.
కాని అతను ఎముకలు కొరికే చలి కారణంగా చనిపోయాడని తెలుసు కుంటాడు. బాధపడతాడు. అతని మృతదేహం దగ్గర రాసి ఉన్న ఓ కాగితంముక్క కనిపిస్తుంది. అది తీసి చదువుతాడు ధనవంతుడు.
"నాకు కోటులాంటి గట్టి బట్టలు లేకపోవచ్చు. కానీ చలిని పోరాడే శక్తి నాకుండేది. 
కానీ మీరు నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేసినప్పుడు లోలోపల ఎంతో సంతోషించాను. దాంతో నా మానసిక శక్తిని కోల్పోయాను. మీరిచ్చిన మాట మీద నమ్మకం పెంచుకుని ప్రతికూలతను తట్టుకునే శక్తిని కోల్పోయాను" 
ఇదొక విదేశ కథే కావచ్చు కానీ ఈ కథ చెప్పే నీతి... ఇచ్చిన మాట  నిలబెట్టుకోలేననిపిస్తే  ఎలాంటి వాగ్దానమూ చేయకూడదు.  

కామెంట్‌లు