"కుమలడం మానాలి...కానీ";-- యామిజాల జగదీశ్
కుమిలిపోని మనిషంటూ
ఎవడుంటాడు...

కుమలడం కోసం
మనిషి ఎప్పుడవకాశం వస్తుందాని
నిరీక్షిస్తుంటాడు

కుమలడం అనేది 
పుండుకి 
మనసు మందు పూసే చర్య

ఇదిగో చూడండి...

కర్ణుడు 
కృష్ణుడి దగ్గర కుమిలిపోయాడు

కృష్ణా,
నన్ను పుట్టడంతోనే 
నా తల్లి నన్నొదిలేసింది...

అంగీకరింపబడని
శిశువై పుట్టడం నా నేరమా...

నాకు విద్య 
నేర్పడానికి ద్రోణాచార్యులు 
నిరాకరించారు

నేను
క్షత్రియుడిగా 
పుట్టకపోవడం  నా తప్పా...

పరశురాముడు 
నాకు విద్య నేర్పారు
తీరా నేను 
క్షత్రియుడనని 
తెలిసిన తర్వాత 
నన్ను శపించారు

యథేచ్ఛగా 
నా బాణం 
ఓ పశువు ప్రాణం తీసింది

ఆ పశువు 
యజమాని నన్ను శపించాడు
అది నా నేరమా?

ద్రౌపది స్వయంవరంలో
అవమానపడ్డాను

తాను పొందిన 
ఇతర పిల్లలను కాపాడటం కోసం
కుంతి నాతో చివర్లో 
నిజం చెప్పింది

నాకు దక్కిన 
గొప్పలన్నీ 
దుర్యోధనుడు ప్రసాదించినవే

కనుక
నేను అతని పక్షాన ఉండటం
తప్పెలా అవుతుంది

వీటన్నింటినీ విన్న కృష్ణుడు
ఇలా చెప్పుకొచ్చాడు..

కర్ణా!
నేను చెరసాలలో పుట్టాను

ఆ రోజు రాత్రే 
నేను తల్లిదండ్రలను వీడాను

నేను పుట్టడానికి ముందే
మరణం 
నన్ను వెంటాడింది

యవ్వన ప్రాయంలో
నువ్వు 
అశ్వాల దౌడు శబ్దం విన్నావు

అదే ప్రాయంలో 
నేను శ్వాసించింది గోమయ వాసనలు

పలుసార్లు 
నన్ను హతమార్చడానికి 
జరిగిన ప్రయత్నాలను ఎదుర్కొన్నాను

నాకు చదువూ లేదు దళమూ లేదు

నా తప్పేదీ లేకుండా
అన్ని సమస్యలకూ 
నువ్వే కారకుడివనే విమర్శలను
వినాల్సి వచ్చింది

నీ వీరత్వాన్ని
నీ గురువులు కొనియాడారు

నాకు చదువే లేదు
సాందీపుడనే రుషి దగ్గర
ఛదువుకున్నానంతే

నువ్వు మనసుకు నచ్చిన
యువతిని పెళ్ళాడావు

నేను 
కోరుకున్న యువతిని 
పెళ్ళాడలేకపోయాను

జరాసంధుడి నుంచి
నా వారిని కాపాడుకోవడానికి
యమునా నది తీరం నుంచి
బహుదూరాన ఉన్న మధురకు
పోవాల్సి వచ్చింది
ఈ క్రమంలో
పారిపోయి దాక్కున్న పిరికివాడిననే
మాట పడ్డాను

యుద్ధంలో 
దుర్యోధనుడు గెలిస్తే 
నీకు ఖ్యాతి లభిస్తుంది

యుద్ధంలో 
ధర్మరాజు గెలిస్తే
నాకేమిటి లభిస్తుంది
యుద్ధాన్ని నడిపానన్న 
ఆపవాదుతప్ప 
ఇంకేం లభిస్తుంది...?!

అందుకే అంటున్నా 
ఈ ఒక్క విషయాన్ని 
మనసులో ఉంచుకో కర్ణా..

సవాళ్ళతో కూడినదే 
ఈ జీవితం

అందరికీ
జీవితం ఒకేలా ఉండదు

ధర్మరాజుకీ
దుర్యోధనుడికీ
జీవితం
న్యాయంగా లేదు

ధర్మం వైపున్న ఉన్న 
మనస్సాక్షి బాధపడదు
కుమిలిపోదు

ఆ అవమానాలను
ఏ విధంగా అధిగమించావన్నదే 
ముఖ్యం

కుమిలిపోవడం ఆపు కర్ణా

అనైతికతలు
ఎదురైనంత మాత్రాన
అధర్మం చెయ్యడానికి
ఆమోదముద్ర లభించదు

కుమలడమనేది
రాత్రి గడిచి 
తెల్లవారితే ఉండదు

కింద పడ్డవాడు
కళ్ళు తుడుచుకుని
లేచి నిలబడి 
మళ్ళీ నడక కొనసాగించినట్లు
జీవితంలో 
చేతులూపుతూ
అడుగులెయ్యి
పార్థుడు వెంట వస్తాడు


కామెంట్‌లు