సుప్రభాత కవిత ; -బృంద
చీకట్లో తడుస్తున్న మనసుకు
వెలుగు కిరణపు రాక 
ఒక ఓదార్పు

చిగురించే చిగురుకు 
ఉదయించే వేకువ వెలుగుల రాక 
ఒక గుర్తింపు

విరిసే పూలతో నిండిన తీగకు
తొలివెలుగుల స్వాగతం
ఒక ఆహ్వానం

ఆలోచనల మధనంలో గడచిన 
కలతల రేయికి వేకువ 
ఒక నిట్టూర్పు.

ఊహల ఉయ్యాలూగిన మదికి
తూరుపు తెల్లారితే 
ఒక ఉత్సాహం

జీవితగమనంలో మనిషికి
ప్రతి పగలూ లభించే
ఒక కొత్త ఊపిరి

స్వప్నాలలో స్వర్గ ద్వారాలు
చేరిన కనులకు... వెలుగు 
ఒక వాస్తవం

రేపటిపై కోటి ఆశలు పెంచుకున్న
హృదయానికి ఉదయం 
ఒక అవకాశం

కాలచక్రపు భ్రమణంలో
ప్రతి సూర్యోదయం 
ఒక ఆవృతం

ఆశావహ ఆలోచన గలవారికి
రేపన్నది ఎపుడూ 
ఒక అమృతం

రాత్రి నిదురించిన జగతికి
తెలివెలుగుల కానుక
ఒక చైతన్యం

అలసిన మనసుకు 
అరుణోదయ కాలం
ఒక ఆనందం

ఆనంద గంధాలు ప్రసరించు
కిరణాల ఆగమన దృశ్యం 
ఒక అందమైన అనుభవం.

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు