సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -114
నారికేళ తృణ న్యాయము
*****
నారికేళము అంటే కొబ్బరి కాయ, టెంకాయ అనే అర్థంతో పాటు కొబ్బరి చెట్టు అనే అర్థం కూడా ఉంది.తృణము అంటే గడ్డి.
కొబ్బరి చెట్టు  ఆకులకూ,గడ్డికి సంబంధమే లేదు కానీ ఒకానొక వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కాడు.ఎందుకు ఎక్కావు? అంటే గడ్డి కొరకు ఎక్కాను అన్నాడుట.
అది అబద్ధమన్న విషయం మనకు అర్థమవుతూనే ఉంది.అతడు ఎక్కింది కొబ్బరి కాయల కోసమని. 
చేయబోయే తప్పుని కప్పి పుచ్చుకోవడానికి ఆ మాట అన్నాడన్న మాట.
దీనికి సంబంధించిన తెలుగు సామెత చూద్దాం. "తాటి చెట్టు ఎందుకెక్కావు అంటే దూడ గడ్డి కోసం " అన్నాట్ట ఓ వ్యక్తి.
అతడు ఎక్కింది కల్లు తాగడం కోసం కానీ అబద్ధం ఆడాడు. ఆడిన అబద్ధం అతికినట్టు ఉందా అంటే లేదు.
అబద్ధం చెప్పకూడదు.అలాంటి పని చేయకూడదు. ఒకవేళ బుద్ధి గడ్డి తిని చేశాడే అనుకుందాం.దాన్ని అతికినట్టు కూడా చెప్పడం చేత గాని వాన్ని గురించి సరదాగా ఈ సామెతను,ఆ నారికేళ తృణ న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
 అసలు అబద్ధమే ఆడకూడదు ఒక వేళ ఆడాల్సిన పరిస్థితి వస్తే ఏయే సందర్భాల్లో ఆడవచ్చో పోతన గారు భాగవతంలో బలి చక్రవర్తిని హెచ్చరించేందుకు శుక్రాచార్యుడితో చెప్పించిన పద్యం ఇది.
వచ్చిన వాడు వామనుడు కాదు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు. అతడికి దానం ఇస్తానని మాట ఇచ్చాను అంటున్నావు.అతడు అడిగిన మూడు అడుగులు ఇస్తానని అన్నావు . ఆ మూడు అడుగులు ఇస్తే నీవు నిలవడానికి చోటు ఉండదు.ఇచ్చిన మాటను  వెనక్కి తీసుకో.కొన్ని సమయాలలో అబద్ధం  ఆడితే తప్పులేదనే సందర్భంలో చెప్పిన పద్యం ఇది. 
వారిజాక్షులందు వైవాహిక ములందు/ ప్రాణ విత్త మాన భంగమందు/ చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు/ బొంకవచ్చు నఘము పొందడథిప!"
"ఓ బలి చక్రవర్తీ! ఆడువారి విషయంలో కానీ, పెళ్ళిళ్ళ సందర్భంలో కానీ,ప్రాణానికీ,ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ,భీతిల్లిన గోవులను, పెద్దలను కాపాడేటప్పుడు అవసరమైతే అబద్దం చెప్పవచ్చు.దాని వల్ల ఏ పాపమూ రాదు." అంటాడు.
 కాబట్టి పిచ్చి పనులు చేస్తూ అబద్ధం ఆడటం కాదు ఒక మంచి పనికోసం దాని వల్ల జరిగే మేలు కోసం అబద్దం ఆడవచ్చు కానీ ఇలా అడ్డంగా దొరికిపోయి ఎడ్డెమొహంతో అబద్దం ఆడటం కాదు.
ఇదండీ "నారికేళ తృణ న్యాయము" దాని వల్ల మనం అబద్ధం ఆడకూడదనీ, ఆడితే ఎలాంటి సమయాల్లో ఆడాలో తెలుసుకున్నాం కదా!.
 
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు