సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -91
తృణారణిమణి న్యాయము
*****
తృణము అంటే గడ్డి.అరణి అంటే నిప్పు పుట్టించుటకు ఉపయోగించే కొయ్య వస్తువు.
దీనిని జమ్మిచెట్టు కొయ్యతో చేస్తారు.ఈ చెట్టు యొక్క ప్రస్తావన రుగ్వేద కాలం నుండి ఉండటం విశేషం. ఈ చెట్టు  యొక్క బలమైన కొమ్మలను రాపాడించి అగ్నిని పుట్టించే వారు.అలా నిప్పును పుట్టించడానికి ఉపయోగించిన జమ్మి కొయ్య  సాధనమును అరణి అంటారు.
అలాగే సూర్యకాంతిని   సూర్యమణి,అగ్ని మణి అంటారు.అగ్ని అంటే నిప్పు, జ్యోతి,సెగ, వేడి అనే అర్థాలు ఉన్నాయి.
ఇలా గడ్డి వలన కలిగిన నిప్పును గడ్డి నిప్పు అని,అరణి యందు మధింపబడిన నిప్పును యజ్ఞాలలో హోమాలలో ఉపయోగిస్తారు కాబట్టి  పవిత్రమైన హోమాగ్ని అనీ, అలాగే  సూర్యుని నుండి పుట్టిన కాంతిని,వేడిని జ్వాలను, సూర్య కాంత మణి  అని అంటారు.
ఇలా మూడు రకాలుగా ఏర్పడింది  నిప్పే అయినప్పటికీ అది  ఉద్భవించిన స్థానాన్ని బట్టి  గౌరవం, పవిత్రతను పొందుతుందని గ్రహించాలి
దీనినే మనుషులకు వర్తింప చేస్తే మనిషిలో ఉద్భవించిన జ్ఞానమనే స్థానాన్ని బట్టి,అది ఆచరణలో ఉపయోగించడాన్ని బట్టి గౌరవ మర్యాదలు పొందడాన్నే తృణారణిమణి న్యాయముగా చెప్పుకోవచ్చు.
మనిషి యొక్క జ్ఞానమును నిప్పుతో పోలిస్తే ఒక్కో చోట ఒక్కో విధంగా ఎలా గౌరవాన్ని పొందుతుందో అలాగే నీటితో కూడా పోల్చ వచ్చు. చెరువులో ఉన్నది నీరే అయినప్పటికీ ఆ నీటిని పవిత్రంగా భావించరు.అలాగే సముద్రంలో నీటిని అపార జలరాశి,అంభోనిధి, నీరధి పయోధి, అంటామే కానీ సముద్రపు నీటిని పవిత్రంగా భావించం. కానీ నది నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తాం. కాశీలాంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు గంగా జలాన్ని కొనుక్కుని వచ్చి భక్తితో పూజిస్తాం.
అలాగే అందరం మనుషులమే అయినప్పటికీ  చేసే పనులను బట్టి గౌరవ మర్యాదలు పొందడాన్ని ఈ తృణారణిమణి న్యాయమునకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు