చీకటి దీపాలకు
వెలుగు దారి నిర్మిస్తున్న
మినుగురు పురుగులు!!
ఆకాశం అందదని తెలిసిన
మేఘాలు ఆకాశమై
పర్వతాలను ముద్దాడుతున్నవీ!!
నది సముద్రపు మదిని
దోచుకునేందు కన్నా ముందు
అది కిందికి దుమికి ఎత్తైన జలపాతమై
పర్వతాన్ని గెలుచుకుంది.!!
నిజంగా
నీరు స్వయంవరం
మానస సరోవరంలోనే జరిగితే
శంకంలోని తీర్థం
ఉప్పునీరెలా అవుతుంది!!
సముద్రం విజేత ఎలా అవుతుంది!!?
తేనీరు తేనె కాదు
స్వచ్ఛమైన నీరు మాత్రమే
దాహం తీర్చుతుంది దీనికి తీర్పు ఎందుకు!!
అరచేతుల వేళ్ళ మధ్య
జారుతున్న నీరు
గడియారం ముళ్ళ మధ్య
జరుగుతున్న దూరం
గాజు సీసాలో
జారుతున్న ఇసుక
కంటికి మసకబారిపోతుంది
కాలానికి కలగా మిగులుతుంది!!
రంగుల్ని ఒక్కచోటికి
చేర్చగలిగేది చీకటి లేదా వెలుగు
కానీ ఆ రెండు ఎప్పుడు
కలిసి ఉండలేవు!!
నిద్రమత్తులో ఉన్న విత్తనం
మూలాలు వేళ్లలో కాదు
నేలలో ఉంటాయి.
ఒక్కసారి మొలకెత్తితే
మొత్తం మత్తు వదులుతుంది!!!
ఎప్పుడూ ఆకలితో ఉంటే
లోకం విలువ తెలుస్తుంది
ఎప్పుడు కలలు కంటూ ఉంటే
కాలం విలువ తెలుస్తుంది!!!
భవిష్యత్తు వస్త్రాన్ని కప్పుకున్న మనిషి
ఇంకా నగ్నంగానే కనిపిస్తున్నాడు
వర్తమానాన్ని
ఇంకా అవమానిస్తూనే ఉన్నాడు!!
పుష్పాల అస్తిపంజరాలు
కన్నీరు కారుస్తున్నాయి
మోసపోయిన మాంసం
మళ్లీ చిగురించి కాయై కాస్తుంది ఏమో!!?
ఎగిరిపోతున్న చూపులు
కరిగిపోతున్న కోరికలు
ఒక్క చోటే
సమాధి చేయబడుతున్నవీ!!
అదృశ్యమైపోయే మనిషి
మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాడు
ఒక్కడు ఒక్కసారే కనిపిస్తాడని తెలిస్తే
నిత్యం జీవిస్తాడు!!
బ్రతకడం ఇష్టం లేకపోతే
పుట్టకుండా ఉండలేవు
పుట్టడం ఇష్టం లేకపోతే
బ్రతకకుండా ఉండలేవు!!
కష్టపడడం ఇష్టపడడం మాత్రమే
నీ చేతుల్లో ఉంది
దీన్ని ఆపడం నీ చేతుల్లో లేదు
మనం మినుగురు పురుగులం!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి