సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -109
ధర్మాధర్మాత్మక న్యాయము
*****
ధర్మము అంటే న్యాయము, ఆచారము,అహింస, సామ్యము, పుణ్యము, స్వభావము, వేదాంతము శృతి స్మృత్యాదులందు విహిత కృత్యము, సత్సంగము,భాగ్యస్థానము,కర్తవ్యము, సంప్రదాయము,సత్కార్యము, ధర్మరాజు, యముడు లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
అధర్మము అనగా పై వన్నీ కానిదే అనగా ధర్మము కానిదే అధర్మము.ఆత్మకము అంటే మార్గము, కలయిక అనే అర్థాలు ఉన్నాయి .
ఈ ప్రపంచంలో ధర్మము,అధర్మము రెండూ కలిసి ఉన్నాయనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
  
అసలైన ధర్మము అంటే ఏమిటో చెప్పమని మహా భారతంలో   దృతరాష్ట్రుడు విదురుని ప్రశ్నించినప్పుడు ఇలా వివరించాడు.
 "ఒరులేయవి యొనరించిన/ నరవర!యప్రియము దన మనంబున కగు దా/ నొరులకు నవి సేయకునికి/ పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్/" "అనగా ఇతరులు ఏ పని చేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో అటువంటి పనిని ఇతరుల విషయంలో చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమయిన ధర్మం" అని వివరించాడు.
ఈ విధంగా ధర్మము మంచిని,అధర్మము చెడును సూచిస్తుంది.మరి ధర్మాధర్మాలు ఉన్న ఈ లోకంలో మనం ఆచరించవలసిన ధర్మాలు ఏమిటి?అవి ఎలా తెలుస్తాయి? అనే సందేహాలు మన మనసును వేధిస్తూ ఉంటాయి.
అలాంటి వేదనల నుండి బయట పడాలంటే ఇదిగో ఇలాంటి పద్యాలు చదవాలి.
చదువని వాడజ్ఞుండగు/చదివిన సదసద్వివేక చతురత గలుగున్/ చదువగ వలయును జనులకు/ చదివించెద నార్యులొద్ద,చదువుము తండ్రీ!"
సహజ కవి పోతన ఆంధ్ర మహా భాగవతములో హిరణ్యకశిపుడితో అనిపించిన మాటలివి.
తన కొడుకైన ప్రహ్లాదుడిని గురువుల వద్దకు పంపిస్తూ ." "నాన్నా! చదువని వాడికి విషయాలేవీ తెలియవు.మరి  చదివితే ఏమవుతుంది? అంటే మంచి చెడుల మధ్య తేడా ఏమిటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది.అందువల్ల అందరూ చదువుకోవాలి.నిన్ను  నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను.చక్కగా చదువుకో! అంటాడు.
ఇలా ధర్మాధర్మ వివేచన కలిగేందుకు ఇలాంటి పద్యాలు చదువుతూ, పెద్దలు చెప్పిన మంచి మాటలు వినాలి. మనంతట మనమే కొన్ని తెలుసుకోవాలి. అప్పుడే ధర్మాధర్మాత్మక లోకంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందనీ,ధర్మమే రక్షిస్తుందని తెలుస్తుంది.
అందుకే వాల్మీకి రచించిన రామాయణంలో ఒక శ్లోకము లోని వాక్యం మనందరికీ సదా ఆచరణీయం. "ధర్మో రక్షతి రక్షితః " అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది.
ఇదండీ "ధర్మాధర్మాత్మక న్యాయము"
ఈ న్యాయము వల్ల మనం ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాం కదూ! 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు