భగవద్దర్శనం; - సి.హెచ్.ఎస్ ప్రతాప్
 భగవంతుడు తనపై అచంచలమైన నమ్మకాన్ని, తనపై భక్తిని కలిగి ఉంటే చాలు వారిని, వారి యోగక్షేమాలను తానే చూస్తానని భగవద్గీతలో స్పష్టంగా  చెప్పాడు. ఆ భాగ్యాన్ని అందరూ పొందాలంటే ఒక్కటే మార్గం. భగవత్ కథలను నిరంతరమూ వినడం. భగవత్ తత్వాన్ని ఆకళింపుచేసుకోవడం. భగవంతుని మార్గాన్ని అనుసరించడంచేస్తున్న పనులనే భగవంతుని ఆరాధించడంగా భావించి తరించిన భక్తులెందరో ఉన్నారు. కబీర్ వంశవృత్తి నేత నేయడం. నేత పనిలో నిమగ్నమైనప్పుడు కూడ కబీర్ మనసు భగవంతునియందే నిమగ్నమై వుండేది.
చెప్పులు కుట్టే వృత్తిని చేసుకుంటూనే రోంథాస్ రామ నామాన్ని జపిస్తుండేవాడు. గోరా అనే కుమ్మరి ఎప్పుడూ పాండురంగని నామాన్ని జపిస్తూ కుండలు చేసే వాడు. భగవంతుణ్ణి మనసారా కోరుకుంటే చాలు. మనసారా స్మరిస్తేచాలు ఆ వేల్పును వేడుకుంటే చాలు. ఆ పరమాత్మ దయామృతం పొందడానికి ఈ కలియుగంలో నామామృతం ఒక సులభమైన మార్గమని వేదాలు చెబుతున్నాయి. ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. భగవంతునికి తరతమభేదాలు నీనా తారతమ్యాలు ఉండవు. దేవతలనైనా, దానవులనైనా నరులనైనా ఒక్కటేభావనతో చూస్తారు. రాక్షసులు చేసిన స్తుతికి, రాక్షసులు చేసే మంచిపనులకు కూడా భగవంతుడు మెచ్చుకోలు ఉంటుంది. అందుకే వారికి వారు కోరిన వరాలనిస్తారు.  ‘చిత్తశుద్ధి లేని శివపూజలేల’ అని వేమన అన్నట్లు అంతర్యామి పట్ల ప్రేమ, ఆరాధన లేకుండా పైపై పూజలు, పెదవి నుండి వచ్చే ప్రార్థనలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేవు. భగవంతుని శరణు వేడటానికి చిన్న పెద్ద, బీద గొప్ప అనిగాని మనుషులు, పశువులు అనే భేదభావంగాని అవసరం లేదు. ఆర్తత్రాణ పరాయణుడైన భగవంతుడు అశక్తులు, ఆపన్నులను అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు.

కామెంట్‌లు