నేడే గంగానదీ పుష్కరారంభః*
 *గంగానది పుష్కరం*

*కోట్లాది మందికి జీవన్ముక్తిని ప్రసాదించే పరమపావని గంగమ్మకు ఈ యేడాది పుష్కరాలు.*
గంగానదీ పుష్కరాలు గురువు (బృహస్పతి) మేష రాశిలో ప్రవేశించినప్పుడు, వైశాఖ శుక్ల విదియ ఏప్రిల్ 22న ప్రారంభమై, గురువు (బృహస్పతి) మీనంలో ప్రవేశించినప్పుడు వైశాఖ శుక్ల త్రయోదశి మే 03, 2023 వరకు జరుగుతాయి.
పుష్కరములు మొదలు నుంచి సార్ధ త్రికోటి దేవతా సహితముగా, బృహస్పతి గంగానదీ జలాల్లో ఉండటం చేత స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానములు చేయుట ఎంతో శ్రేయస్కరం. దీని వలన పితృదేవతలు తరించి కుటుంబవృద్ధి జరుగుతుంది.
*పుష్కర గాథ*
తుందిలుడు అనే గంధర్వుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకుని, తనకు ఆయనలో శాశ్వతస్థానం కల్పించమని అర్థించాడు. అప్పుడు ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలునికి శాశ్వతస్థానం కల్పించాడు. ఆవిధంగా మూడున్నర కోట్ల తీర్థాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. పుష్కరం అంటే పుణ్యజలం అనే అర్థం కూడా ఉంది. జలాలకు అధికారి అయినందున, తుందిలుడు పుష్కరుడయ్యాడు. పుష్కరుడు అంటే పోషించేవాడని కూడా అర్థం ఉంది. నదీజలాలకు అధిపతి అయిన బృహస్పతి, వివిధ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు, పుష్కరుడు ఆయా నదీజలాల్లో ప్రవేశిస్తాడు. ఈ సందర్భాన్నే పుష్కరాలుగా వ్యవహరిస్తారు.
*విష్ణు స్వరూపం*
మహావిష్ణువే గంగగా రూపుదాల్చాడని భారతీయుల విశ్వాసం. బృహద్ధర్మ పురాణం ప్రకారం పరమశివుని తాండవ నృత్యానికి, సామవేద గానానికి పరవశించిన కేశవుడు ద్రవరూపాన్ని పొందాడు. అది చూచి చకితుడైన బ్రహ్మ, ఆ పవిత్ర జలాన్ని చకచకా తన కమండలంలో నింపుకున్నాడు. ఆ పావన జలంతోనే వామనమూర్తి వామపాదాన్ని సముచితంగా కడిగి కళ్లకద్దుకున్నాడు. గమయతి ఇతి గంగా... నిరంతరం గతిశీలంగా ఉండేది కనుక గంగ అని పిలుస్తారు. గమయతి స్వర్గం, భగవత్పదం ఇతి.... స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగించేది గంగ అంటారు. కొందరు రామకృష్ణాది రూపంగా అవతరించిన నిరాకార భగవంతుడినే పూజిస్తారు. మరికొందరు నిర్గుణ నిరాకార బ్రహ్మమునే ధ్యానిస్తారు.  కానీ, సాంసారిక తాపత్రయ అగ్నిలో పరితపిస్తున్న మేము మాత్రం గంగారూపంగా జలాకారుడైన జగన్నాథుడినే సేవిస్తాం అని ఉత్తములు భావిస్తుంటారు.
పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. 
 
*గంగా నది ప్రధాన పుష్కర్ ఘాట్ వాటి పేర్లు*
1. వారణాసి
2. గంగోత్రి
3. హరిద్వార్
4. బద్రీనాథ్
5. కేదార్నాథ్
6. ప్రయాగ 
7. అలహాబాద్
వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది.
*ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి?*
1. మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు,
2. వృషభ రాశి యందు ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరము,
3. మిథున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరాలు, 
4. కర్కాటక రాశి యందున్న యమునా నదికి,
5. సింహరాశి యందున్న గోదావరి నదికి,
6. కన్యారాశి యందున్న కృష్ణానదికి,
 
7. తుల యందున్న కావేరీ నదికి,
 
8. వృశ్చిక రాశి యందున్న భీమరథీ నదికి, 
9. ధనూరాశి యందున్న పుష్కర నదికి, 
10. మకరమందున్న తుంగభద్రా నదికి, 
11. కుంభ మందు సింధునదికి,
12. మీన రాశి యందు ప్రణీత నదికి పుష్కరాలు ఏర్పడును.
....... కర్రా విరూపాక్ష శాస్త్రి
🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺
Nagarajakumar.mvss

కామెంట్‌లు