పరీక్షలతో నాకో అనుభవ పాఠం;- - యామిజాల జగదీశ్
 నేనేమీ ఫస్ట్ క్లాస్ విద్యార్థిని కాను. ఫెయిల్ కాకుండా ఒక్కో క్లాసూ గట్టెక్కుతుండే వాడిని. నా అకడమిక్ కెరీర్లో నేను ఫెయిల్ అవడం అనేది టైప్ లోయర్ ఎగ్జాములోనే. "నీకు స్పీడ్ లేదు. పరీక్షకు వెళ్ళవద్దని టైప్ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాలుగారు చెప్తున్నా వినకుండా పరీక్షకు హాజరై ఫెయిలయ్యాను. ఫెయిలవుతానని తెలిసీ పరీక్షకు డబ్బు కట్టి వెళ్ళడానికో కారణం బృందా అనే మా పక్క వాటా అమ్మాయి. మేమిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం క్లాసుకి. ఇద్దరం దాదాపూ ఒకటేసారి లోయర్ క్లాసుకి వెళ్ళాం. తను శ్రద్ధ పెట్టి స్పీడ్ పెంచుకుంది. నేను తన కోసం టైప్ క్లాసుకి వెళ్తుండేవాడిని. అంతేతప్ప టైప్ మీది శ్రద్ధతో కాదు. అఫ్ కోర్స్ మరో మూడు నెలలకు లోయర్ పరీక్షకు వెళ్ళి ప్యాసయ్యిను. అప్పుడా అమ్మాయి హయ్యర్ ప్యాసైంది ఫస్ట్ క్లాసులో.  అదలా ఉండనిచ్చి తొమ్మిదో తరగతి పరీక్షల విషయానికొస్తాను.
తెలుగు సెకండ్ పేపర్ ఎగ్జామ్. హాలులోకి వెళ్ళాను. పరీక్ష మొదలైంది. ఓ అర గంటో దాటిందనుకుంటాను. ఇన్విజిలేటర్ మా క్లాసులో ఇద్దరిని కాపీ కొడుతున్నారనే అనుమానంతో పట్టుకుని తన టేబుల్ ముందర నిలబెట్టించి ఏవో ప్రశ్నలు వేస్తూ ఎవరి దగ్గరైనా రెడ్ పెన్సిల్ ఉంటే ఇవ్వమని అడిగారు. 
వెంటనే నేను నా దగ్గరున్న రెడ్ పెన్సిల్ ఇవ్వడానికి మాష్టారు దగ్గరకు వెళ్ళాను. ఆయన ముందర నిలబడి జేబులోంచి ఎర్ర పెన్సిల్ తీస్తుండగా దానితోపాటు మడత పెట్టిన ఓ తెల్ల కాగితం బయటకొచ్చింది. 
మాష్టారు వెంటనే ఆ పేపర్ ఇవ్వమని అడిగితే ఇచ్చాను. ఆ కాగితం ముక్కను అప్పటికే ఆయన ముందర నిల్చున్న ఇద్దరిలో ఒకరికి ఇచ్చి అందులో ఏముందో చదవమన్నారు. (మాష్టారు తమిళం ఆయన. ఆయనకు తెలుగు రాదు. ఆయన పేరు నాగరాజన్ గారు). మా క్లాస్ మేట్ అది చదివి ఇవాళ్టి పరీక్షకు సంబంధించిన జవాబు అందులో ఉంది సార్ అన్నాడు. 
అంతే, వెంటనే మాష్టారు ఆ ఇద్దర్నీ విడిచిపెట్టి "నిన్ను పట్టుకోవడం కోసమే నేనీ నాటకమాడాను. పరీక్ష మొదలైనప్పటి నుంచీ నీమీద నాకొక డౌట్ వచ్చింది. కానీ నిన్నెలా పట్టుకోవాలాని ఆలోచించి ప్లాన్ ప్రకారం నిన్ను పట్టుకున్నా" అంటూ నేను అప్పటి దాకా రాసిన ఆన్సర్ షీట్ తీసేసుకున్నారు. అప్పటికి రేండు పేజీలో ఎంతో రాశాను. అక్కడితో గీత గీసి నన్ను హెడ్మాస్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి కాపీ కొడుతుంటే పట్టుకున్నానని హెడ్మాస్టర్ స్వామినాథన్ గారికి ఫిర్యాదు చేశారు.
"మీ నాన్నగారెవరు? ఏం చేస్తుంటారు?" అని నన్నడిగారు హెడ్మాస్టర్. 
సిగ్గుతోనూ భయంతోనూ ఏడవటం మొదలు పెట్టాను. ఏమీ చెప్పలేదు.
"నిన్నే అడుగుతున్నా, మీ నాన్న ఏం చేస్తారు" అని మళ్ళీ ప్రశ్నించారు హెడ్మాస్టర్. 
ఇక లాభం లేదని ఏడుస్తూ చెప్పాను, మా నాన్నగారు తెలుగు మాస్టారండి. శారదా విద్యాలయంలో పని చేస్తారండి అన్నాను. 
"ఏంటీ తెలుగు మాస్టారు కొడుకువై ఉండీ తెలుగు పరీక్షలోనే కాపీ కొడతావా? మీ నాన్నతో నేను మాట్లాడుతాను. నువ్వింటికి వెళ్ళొచ్చు" అని పంపించేశారు. 
ఇంకేమీ మాట్లాడకుండా స్కూల్లో ఆ రోజు ఇంకెవరినీ కలవక తిన్నగా ఇంటికి వచ్చేశాను. ఇంట్లో ముభావంగా ఉన్నాను. సాయంత్రానికి మా సైన్స్ మాస్టారు కొడుకైన నా క్లాస్ మేట్ సూరి ఇంటికొచ్చి నన్ను ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత మరో ముగ్గురు వచ్చారు. సిగ్గుతో చచ్చాను. 
అసలు జరిగింది ఏమిటంటే...
ఏ పరీక్షకా పరీక్షకు " పరీక్ష హాల్లో" కి వెళ్ళే వరకు ఆ పరీక్షకు సంబంధించిన నోట్ బుక్కు తీసుకెళ్ళి పేజీలు తిరగేస్తుండటం అలవాటు. అయితే తెలుగు సెకండ్ పేపరుకి సంబంధించిన బిట్ చొక్కా జేబులో ఎలా పెట్టుకున్నానన్నది ఇప్పటికీ గుర్తుకు రావడం లేదు. ఆ బిట్ పేపర్ జేబులో పెట్టుకుని హాల్లోకి వెళ్ళానన్న సంగతి మాష్టారు ముందు నిల్చుని జేబులో నుంచి రెడ్ పెన్సిల్ తీసే వరకూ తెలీదసలు నాకు జేబులో ఆ కాగితం ఉన్నట్టు. అంతేతప్ప కాపీ కొట్టాలనే ఆలోచనసలు లేనే లేదు. కానీ రెడ్ హ్యాండడ్ గా దొరికాక ఇక నేను కాపీ కొట్టలేదన్నా నమ్మరుగా. ఆ పరీక్షలో నాకెన్ని మార్కులు వచ్చాయో కూడా గుర్తు లేదు కానీ ఆ ఏడాది " పైతరగతికి " ప్రమోట్ అయ్యాను. "కాపీ కొట్టకపోయినా పట్టుబడ్డ ఈ అనుభవ పాఠంతో ఏ పరీక్షకూ బుక్కు తీసుకువెళ్ళడమనేది మానేశాను.... ఏదన్నా చదవడమంటే ఇంటి దగ్గరతోనే సరి. అయినా నేనేమీ ప్రతిభ గల విద్యార్థిని కాను. మినిమమ్ మార్కులతో గట్టెక్కుతుండే వాడినంతే. 

కామెంట్‌లు