అందుకున్నా పూర్ణపురుషుడిని!;- - యామిజాల జగదీశ్
 ఎక్కడ పోగోట్టుకుంటే అక్కడే వెతకాలి అంటుంటారు కదూ...కానీ నేను పొగొట్టుకున్నదొక చోట....వెతికింది ఇంకొక చోట...అయితే అనుకోకుండా ఒకరోజు ఒకరివల్ల లభించింది. మరొకరివల్ల ప్రింటౌట్ రూపంలో లభించింది. అర్థమయ్యే ఉంటుందిగా....ప్రింటౌట్ అనడంతోనే నేనం పోగొట్టుకున్నది....నాకు మళ్ళీ దక్కనది పుస్తకమని!
దాదాపు నలభై అయిదు సంవత్సరాల నాటి పుస్తకం అది. మా నాన్నగారైన యామిజాల పద్మనాభస్వామిగారు తమ గురువుగారైన హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారిపై ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం శీర్షిక పూర్ణపురుషుడు. 
కర్రా ఈశ్వర రావుగారు మద్రాసుకొచ్చి మరీ మరీ కోరి రాయించుకున్న పుస్తకమది. 
మా నాన్నగారు అచ్చయిన పుస్తకాల ప్రతులను మా అన్నదమ్ములయిదుగురికీ సంతకం చేసివ్వడం అలవాటు. అలాగే ఈ పుస్తకమూ ఇచ్చారు. కానీ నేను ఆ పుస్తకాన్ని ఎలా ఎక్కడ పోగొట్టుకున్నానో తెలీదు. కొంతకాలం వెతికాను. అయితే ఫలితం లేదు.
కానీ ఇటీవల బంగారు రామాచారిగారు ఓ రోజు ఈ పుస్తకం తాలూకు పీడీఎఫ్ ప్రతి నాకు వాట్సప్ లో పంపారు. అది తీసుకుని ఈసిఐఎల్ ప్రాంతంలో ప్రింటౌట్ తీయించుకుని పదిలపరచుకుందా మనుకుంటే నా దగ్గర డబ్బులు లేకపోయాయి. దాంతో ఏం చేయాలా అని ఆలోచించి విషయం మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాసుగారికి చెప్పాను. ఆయన వెంటనే పిడిఎఫ్ తనకు పంపమని చెప్పడంతోనే పిడిఎఫ్ ఫైల్ ఫార్వర్డ్ చేశాను. ఆయన రెండు రోజుల్లో ప్రింటౌట్ తీయించడమే కాక చక్కటి అట్ట వేయించి నాకు అందజేశారు. దీనికి ఎంతివ్వాలో చెప్పలేదు సంగిశెట్టివారు. మొత్తానికి ఎప్పటి నుంచో ఆశించిన  "పూర్ణపురుషుడు"  (నారాయణదాసుగారి జీవితకథనం) పుస్తకం అందింది. పుస్తకమంతా చదివాను.
176 పేజీల పుస్తకం. 1979లో ఈ పుస్తకం ధర అయిదు రూపాయలు. కర్రా శ్యామలాదేవిగారు అచ్చు వేయించారు. 
నా ఆనందం అనంతం...ఇన్నాళ్ళకు సామాన్య ప్రజకు, స్కూలులో చదువు విద్యార్థులకు పనికివచ్చు ఒక మహామహుడు పుంభావ సరస్వతియైన శ్రీమదజ్జాడాదిభట్ట నారాయణదాసు గారి జీవిత చరిత్ర చక్కని చిక్కని మృదు మధురమైన భాషలో సరళమైన శైలిలో మహాపండితులు కవిరత్న శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారు విసుగు లేకుండా త్వరలో పూర్తి చేసి పాఠకలోకమున కందజేసిరి అని కర్రా ఈశ్వరరావు గారు చెప్పారు. 
ఈ పుస్తకం రాయడానికి చాలా వరకు "నా యెరుక" పేరుతో దాసుగారు వ్రాసినదే ఆధారం. మిగిలినది వారి వల్లనూ వారికి తెలిసిన పెద్దల వల్లనూ విన్నదే అని మా నాన్నగారు పుస్తక ప్రస్తావనలో చెప్పుకున్నారు. 
మా నాన్నగారికి నారాయణదాసుగారితో ప్రత్యక్ష పరిచయానుభవం ఉంది. విజయనగరంలో చదువుకుంటున్న రోజుల్లో మా నాన్నగారు తరచూ దాసుగారింటికి వెళ్ళి కలుస్తుండేవారు. జ్యోతిష్యంలోనూ సంగీతంలోనూ సందేహాలు ఉంటే దాసుగారిని అడిగి నివృత్తి చేసుకునేవారు. 
దాసుగారంటే విపరీతమైన అభిమానం. గౌరవం. మర్యాద. ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్తుండేవారు. నా పసితనంలో నన్నో మారు మా నాన్నగారు దాసుగారింటికి తీసుకువెళ్ళారని మా అమ్మ చెప్పగా గుర్తు. అప్పుడు దాసుగారి మంచంమీద పడుకున్నానని, వారింట పప్పు అన్నం తిన్నట్టు అమ్మ చెప్పారు. 1945లో పరమపదించిన దాసుగారిని 1954లో పుట్టిన నేను చూడకపోయినా వారింటికివెళ్ళానన్న ఆనందమైతే నాకుంది. 
దాసుగారి జీవితాన్ని చూస్తున్నట్టే అన్పించింది పూర్ణపురుషుడు చదువుతుంటే. దాసుగారిని "పూర్ణపురుషులు" అని ఆ మహనీయుని వాగ్ధాటికి అభివాదాలు తెలిపిన వారు కావ్యకంఠ గణపతిమునిగారు. ఆ మాటనే తన పుస్తకానికి మా నాన్నగారు శీర్షిక చేశారు. గణపతి మునిగారి దగ్గర కూడా మా నాన్నగారు కొంత కాలం ఆభ్యసించారు. 
ఏదైతేనేం అమూల్యమైన దాసు గారి జీవితచరిత్ర పూస్తకం పిడిఎఫ్ ని అందించిన రామాచారిగారికి, దాని ప్రింటౌట్ ఇచ్చిన సంగశెట్టివారికి కృతజ్ఞతలు.కామెంట్‌లు