ముందుచూపు !;- - బోగా పురుషోత్తం, తుంబూరు.

 విజయపురం రాజు విజయేంద్రవర్మ ఎంతో దయార్థ హృదయుడు. రాజ్యంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టాడు. ఈ కారణంగా  ఖజానాలో వున్న డబ్బంతా ఖాళీ అయ్యింది. దీన్ని గమనించి మంత్రి మల్లన్న ‘తమ రాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండడం ఎలా?’ అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
    ఓ రోజు రాజుకు తన అభిప్రాయాన్ని వినిపించాడు. అయితే విజయేంద్రవర్మ అతని మాట వినలేదు. ‘‘ మంత్రి గారూ.. అన్ని వర్గాల వారిని  ఆదుకుంటున్నాం..ఇక రాజ్యం రక్షణ వారే చూసుకుంటారులే..అయినా ఇంత అభివృద్ధి పథంలో మనం దూసుకుపోతున్నాం..ఎక్కడికి వెళ్లినా ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారు కదా..నీ కెందుకు ఆ సందేహం?’’ అన్నాడు రాజు.
    మంత్రి మల్లన్నకు ఇది నచ్చలేదు. రాజ్య రక్షణకు నిరంతరం తపించాడు. ముందుచూపుతో అప్రమత్తమయ్యాడు.
    రాజు తన మూర్ఖత్వం వీడలేదు. రాజ్యంలో ప్రజలందరికి మరికొన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టాడు. దీంతో ప్రజలు పనిచేయటం మానివేశారు. ముఖ్యంగా రైతులు తమ పొలాల్లోకి వెళ్లడం మాని ఇళ్లలో తిని హాయిగా పడుకోసాగారు. సోమరి తనం ఎక్కువై వివిధ రంగాల ప్రజలు పనులు మానేశారు. పన్నుల వసూలు తగ్గింది. మరోవైపు రాజ్య ఉద్యోగుల జీతభత్యాల కోసం పొరుగు రాజుల వద్ద విజయేంద్రవర్మ అప్పులు చేయసాగాడు. మరో వైపు అధిక పన్నులు విధించారు. అయినా ఖజానాకు ఆదాయం రాలేదు.
    పొరుగు రాజులు తమ అప్పులు వడ్డీతో సహా తీర్చాలని విజయేంద్రవర్మపై ఒత్తిడి చేశారు. రాజుకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.రాజ్యంలో ఆర్థిక  పరిస్థితి దివాలా తీసింది. మరోవైపు పంటలు లేక తీవ్ర ఆహారం సంక్షోభం ఏర్పడిరది. రాజు ఆందోళనతో పొరుగు రాజ్యంలోకి వెళ్లి తలదాచుకున్నాడు.
   సమయం కోసం ఎదురు చూస్తున్న మంత్రి మల్లన్న సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు శ్రీకారం చుట్టాడు. ఉచిత పథకాలన్ని రద్దుచేశాడు. రాజ్య భవనంలో వున్న బంగారాన్ని అంతా పోగుచేసి ఉంగరాలు, చెవిదిద్దులు లాంటివి చేసి ఓ పెట్టెలో పెట్టి సాగుచేస్తున్న భూముల్లో రహస్యంగా పాతిపెట్టాడు.
   కొద్ది రోజుల తర్వాత సాగుచేసిన రైతుకు పొలంలో బంగారు ఉంగరం దొరికింది. అది విని పక్కపొలం రైతు అరక పట్టాడు. అతని భూమిలో సైతం బంగారు చెవి దిద్దులు దొరికాయి. ఈ విషయం రైతుల చెవిన పడిరది. అందరూ ఆశతో పొలాలు దున్నారు. బీడు వారిన పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాయి.వరి ధాన్యం దొరికి ఆహార సమస్య సమసిపోయింది.  రైతులు పండిన ధాన్యాన్ని అమ్ముకోవడంతో లాభంవచ్చి పంట శిస్తులు చెల్లించారు. 
    ఖజానాకు ఆదాయం రావడంతో అప్పులు ఇచ్చిన రాజ్యాలకు సగభాగం వడ్డీ, అప్పులు తీర్చాడు. క్రమక్రమంగా రాజ్యంలో అటు ఆహార సంక్షోభం, ఇటు ఆర్థిక సంక్షోభ సమస్యలు సమసిపోయాయి. విద్య, వాణిజ్యం, పెట్టుబడులు, నిరుద్యోగం, తదితర రంగాలపై దృష్టిపెట్టాడు. విద్యకు అధికంగా నిధులు కేటాయించి ప్రజలకు సాంకేతిక విద్య, ఉన్నత విద్య అందించాడు. మరో వైపు వాణిజ్య రంగంపై దృష్టిపెట్టి పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమ ఏర్పాటుకు తోడ్పడ్డాడు. రాజ్యంలో ఉన్నత విద్యావంతులకు తగిన ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు విజయపురం అన్ని రంగాల్లోనూ విజయపథంలో దూసుకుపోసాగింది.
     పక్క దేశంలో అజ్ఞాతంలో వున్న రాజు విజయేంద్రవర్మకు ఈ విషయం తెలిసింది. మారు వేషంలో తమ దేశంలోకి ప్రవేశించి మంత్రి మల్లన్న వద్దకు వెళ్లి ‘‘ ఇదంతా ఎలా సాధ్యమైంది..మంత్రి గారూ..?’’ ప్రశ్నించాడు.
     ‘‘ రాజా మీరు దూరదృష్టితో పరిశీలించకపోవడం వల్లే రాజ్యంలో పరిస్థితులు అస్తవ్యస్త మయ్యాయి. ఉచిత పథకాలు తాత్కాలిక ఉపశమనం కల్గిస్తాయే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించవు.. దీన్ని గ్రహించే నేను మొదట ఖజానాకు ఆదాయ మార్గాలు అన్వేషించాను. తరువాత ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి నిరంతరం శ్రమించాను.. ఆ ఫలితంగానే ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి..దేశం సంక్షోభాన్ని వీడి సుభిక్షంగా వుంది..నేను అనుసరించిన మార్గం ఇదే..’’ అని తన విజయ రహస్యం చెప్పాడు మంత్రి మల్లన్న.
    విజయేంద్ర వర్మ తన రాజ్యాన్ని తనకు దక్కించి ఇచ్చినందుకు మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపాడు. తన రాజ్యంలో మల్లన్నను ఆర్థిక సలహాదారుడిగా నియమించుకుని అతని సలహాలతో మూర్ఖత్వం వీడి రాజ్యాన్ని విజయపథంలో నడిపించాడు.
కామెంట్‌లు