ధర్మాచరణ; -:సి.హెచ్.ప్రతాప్
 సత్యం, ధర్మం, శాంతం, ప్రేమ అనేవి మానవ ధర్మములుగా శాస్త్రం నిర్వచించింది. వాటిని నిరంతరం ఆచరణలో పెట్టిననాడు మానవుడు మహోన్నతుడు కాగలడు. ఇందులో భాగంగా సత్యం అనేది ఎల్లప్పుడూ పలుకుతూనే వుండాలి. సత్యం వలన మనిషి జీవితం ధన్యం కాగలదు. ధర్మం కూడా  అటువంటిదే. ధర్మం పాటించినవారికి ధర్మమార్గం, సత్యసంధతను కలిగిస్తాయి. మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము యొక్క ముఖ్య లక్షణమని చెప్పవచ్చును. భూమి మీద సకల మానవులలోను కొందరు ఉత్తములుగా నుండి తోటి మానవులలో పూజింపబడితే దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మ గుణమే ప్రధాన కారణము. శాంతి, దయ, అహింస, సత్యము, అస్తేయము, ఉపకారము, సానుభూతి, శౌచము మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.
పుడమిపై పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. కనుక ధర్మనిబంధనలు తెలుసుకుని మసలుకోగలిగినవారే నిజమైన మానవుడు అనిపించుకుంటాడు. ధర్మ నిబంధనలకు త్రిలోదకాలిచ్చి తమ ఇష్టానుసారం జీవించేవారు పశుప్రాయులౌతారు.పవిత్రమైన వేదాలలో సైతం ధర్మసూత్రాలు ఎన్నో వివరించబడి వున్నాయి. వాటిని మనం యధావిధిగా ఆచరించాలి. అప్పుడే సకల మానవాళికి శుభోదయం కాగలదు. ధర్మరాజు, సత్యహరిశ్చంద్రుడు సత్య ధర్మ సూత్రములు పాటించి మహాపురుషులుగా మిగిలిపోయారు.ఒకవెళ వేదాలలో వున్న ధర్మసూక్స్మం మనకు అర్ధం కాకపోతే వాటిని వివరించగల సాధు, సత్పురుషులను ఆశ్రయించాలి.ఆహారాన్ని స్వీకరించటం, నిద్రించటం, భయాందోళనలు చెందటం , సంతానాన్ని పొందటం, వంటివి, పశువులకు  మనుష్యులకు సాదృశ్యధర్మాలే.
తన ధర్మాన్ని తెల్సుకోవటం, ఆచరించి జన్మను సార్థకం చేసుకోవటమే మనిషి విశిష్టత. ధర్మాచరణ వలన అర్థ ప్రాప్తి , ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మము యొక్క సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది.

కామెంట్‌లు