పుష్కరుని వృత్తాంతం.;- తాటి కోల పద్మావతి

 ఒకప్పుడు"తుందిలుడు"అనే మహర్షి చాలా కాలం తపస్సు, భగవత్కృపకు పాత్రుడై, మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి అయి, పుష్కరుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. పుష్కర మంటే జలం. భగవంతుని ఎనిమిది మూర్తాల్లో (పంచభూతాలు+మనసు, బుద్ధి, అహంకారం=8) జలం ఒకటి. తుందిలుడు భగవంతుని యొక్క జల రూపాన్ని పొందడం వల్ల అతనికి"పుష్కరుడు"అనే ప్రసిద్ధి వచ్చింది.
బ్రహ్మ దీక్షతో తపస్సు చేసి, భగవంతుడిని మెప్పించి, సృష్టి కార్యములో పుష్కరుడు తనకు ఉపయోగపడతాడనీ, కనుక అతన్ని తనకు ఇమ్మని ప్రార్థించాడు.
'అట్లే 'అన్నాడు-భగవంతుడు. జల రూపంతో ఉండే పురుషుణ్ణి కమండలంలో ఉంచుకొని, బ్రహ్మ లోకాలను సృష్టించసాగాడు.
ఇలా కొంతకాలం గడిచింది. సృష్టి జరుగుతూ ఉన్నది. బృహస్పతి ఎట్లో బ్రహ్మను ప్రసన్నుడిని చేసుకున్నాడు. బ్రహ్మ'ఏం కావాలి'అన్నాడు. అవకాశం దొరికింది కదా అని-'పుష్కరుడు నాకు కావాలి'అన్నాడు. బ్రహ్మ సరేనన్నాడు. కానీ పుష్కరునికి బ్రహ్మను వదిలి, బృహస్పతి వద్దకు పోవడం ఇష్టం అలా పోనని కూడా చెప్పాడు-బ్రహ్మతో.
అయితే అందరూ ఆలోచించి,"బృహస్పతి ఎప్పుడు కొత్త రాశిలో ప్రవేశించినా -మొదటి 12 రోజులూ, చివరి 12 రోజులూ -ఆ సంవత్సరంలోనే మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నాలుగు ఘటియలు (96 నిమిషాలు) మాత్రం పుష్కరుడు బృహస్పతి ఆధీనంలో ఉండాలని"నిర్ణయించారు.

కామెంట్‌లు