"మామిడికాయ - మనసు";- - యామిజాల జగదీశ్
 కొన్ని విషయాలలో నా మనసు బలహీనమైనదే. కనుక సున్నితమైనదని వేరేగా చెప్పక్కర్లేదు. నాకు నేనిలా చెప్పుకోవడం ఒకింత నన్ను నేను చదువుకుంటున్నాను కనుక.
మౌలాలీలో మేముంటున్న ఇంటికి ఓ నాలుగు వీధుల అవతల ఓ చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఉంది. ఓ ఆరుగురు కూర్చుని టిఫిన్లు తినొచ్చు.  పేరు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. ఇక్కడికి వెళ్ళి ఓ ఆరు ఇడ్లీలు కొనుక్కొచ్చి నేనూ మా ఆవిడా చెరో మూడు తినడం అలవాటు. ఇక్కడికి వెళ్ళే దార్లో ఓ అయిదారిళ్ళల్లో వేసవిలో మామిడిచెట్లు కాయలతో కలకలలాడుతుంటాయి. ఒక్కో చెట్టుకీ ఒక్కో రకం కాయలు. చూడటంతోనే కోయాలని తినాలని మనసు లాగు తుంటుంది. కానీ వయస్సు రీత్యా వాటి మీద రాళ్ళు విసిరి కింద పడితే ఏరుకుని ఆ ఇంటి యజమానికి దొరక్కుండా పారిపోలేనుగా. కనుక కోసుకు తినాలనే మనసుకి నచ్చచెప్తుంటాను....చెట్టున కాయల్ని చూసి తృప్తిపడు. అంతేతప్ప కోయాలనుకోకు. కానీ ఇది క్లిష్టమైన పనే.
చిన్నప్పుడంటే మేము మద్రాసులోని బజుల్లారోడ్డులో ఓ మరాఠీ వాళ్ళింట అద్దెకుండేవాళ్ళం. ఆ ఆవరణలో మూడు రకాల మామీడి చెట్లుండేవి. ఒకటేమో రుమానీ. రెండోది మంజనార్ (తెలుగులో దీని పేరు తెలీదు. కాస్తంత వాసన వేసేది. కాయకన్నా పండితే బాగుండేది.) ఇక మూడో చెట్టు కిలిమూక్కు మాంగా (అంటే తెలుగులో చిలుకముక్కు మామిడికాయలు. ఇవి పుల్లగా ఉండేవి.). ఈ మూడింట్లో రుమానీ బాగుండేది. ఈ కాయలు తినడంకోసం వాటి కింద క్రికెట్ ఆడుతున్నట్టు ఆడి బంతిని మామిడికాయలమీదకు కావాలనే విసిరే వాళ్ళం. మామిడికాయ కింద పడటంతోనే ఏరుకుని ఓ మూలకెళ్ళి తినేవాళ్ళం. 
కానీ ఇప్పుడలా రాయో బంతో చెట్టు మీదకు విసరనూ లేను. కిందపడిన కాయను ఏరుకునేందుకేమో వయస్సు అడ్డొస్తుంది. అలాగని మనసు ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. కాయ తినాలన్పిస్తుంది. కానీ అలా తినలేను. 
ఓ ఇంట నిలబడి కర్ర సాయం లేకుండా కాయలు కోసుకునేంత ఎత్తులోనే ఉన్నాయి. వాటిమీద దృష్టి మరల్చకూడదనుకుంటేనా చూస్తాయి కళ్ళూ మనసూ. కానీ ఆ సమయంలో మనసుని నియంత్రించు కోవడానికి పడే అవస్థ ఇంతా అంతా కాదు. ఆ ఇంట్లో వాళ్ళు త్వరగా కాయలు దించేస్తే బాగుంటుందని అనుకునే వాడిని. ఈరోజు అనుకున్నంతా అయ్యింది. ఆ మామిడి చెట్టు ఒకటి రెండు కాయలతో బోసిపోయింది. నిన్నటి వరకూ గుత్తుగుత్తులుగా ఉన్న కాయలు కనిపించలేదు. కోసేసినట్లున్నారు. దాంతో అమ్మయ్య అనుకున్నాను. ఇక నా మనసు నా గుప్పెట్లోనే ఉంటుందని ఊపిరిపీల్చుకుం
టూ ఇంటికి చేరాను.
కామెంట్‌లు