సునంద భాషితం - వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -112
నసీప్రోత బలీవర్ద న్యాయము
*****
నసీ అంటే ముక్కు. ప్రోతము అంటే కట్టబడిన కుట్టబడిన గుడ్డ ముక్కలతో తయారు చేసిన తీగలాంటి తాడు.బలీవర్థము అంటే ఎద్దు లేదా వృషభము.
నసిప్రోత బలీవర్దము అంటే ముక్కు తాళ్ళు వేసిన ఎద్దు అని అర్థం.
నసీ ప్రోత బలీ వర్ద న్యాయము అంటే ఎద్దుకు ముక్కు త్రాళ్లు కట్టి వశపరచుకున్నట్లే విరోధుడైన దుష్టుని నుంచి కూడా పనిచేయించుకోవచ్చు అర్థంతో ఉపయోగించిన న్యాయము ఇది.
అయితే అది సాధ్యమయ్యే పనేనా అంటారు భర్తృహరి తన సుభాషితంలో...
"జలమున నగ్ని,ఛత్రమున చండమయూఖుని దండతాడవం/బుల వృషగర్దంబులను పొల్పగు మత్త కరీంద్రమున్ సృణిం/చెలగెడు రోగ మౌషధముచే,విషముందగు మంత్ర యుక్తి ని/మ్ముల తగ చక్క చేయనగు మూర్ఖుని మూర్ఖత మాన్ప వచ్చునే/"
అంటే అగ్ని చేత ఇళ్ళు కానీ వస్తువులు కానీ కాలిపోతుంటే ఆ మంటలను నీళ్ళతో చల్లార్చవచ్చు. ఎంత మండిపోతున్న ఎండ వేడినైనా తట్టుకోవడానికి గొడుగు పట్టుకుంటే సరిపోతుంది.ఎద్దును, గాడిదను గట్టి కర్ర దెబ్బలతోనూ, మదించిన ఏనుగును అంకుశం చేతనూ, పాము,తేలు కుట్టి విషమెక్కితే మంత్రము చేతనూ చక్కగా చేయవచ్చు కానీ మూర్ఖుని మూర్ఖత్వాన్ని మాన్పడానికి ఏ మార్గం లేదు అంటారు.
 ( పాము, తేలు విషయంలో వెనుకటి కాలం వారి నమ్మకాన్ని ఉదహరించారు.అంతే కానీ పాము, తేలు కుడితే  భయపడకుండా ధైర్యం చెబుతూ మొదట ప్రథమ చికిత్స,ఆ తర్వాత వైద్య చికిత్స చేయించాలి.అప్పుడే వారిని బ్రతికించుకోగలం అన్నది మర్చిపోకూడదు.)
దుష్టునిలో ఇతరులకు హాని చేసే గుణంతో పాటు అంతకు మించిన మూర్ఖత్వం ఉంటుంది. వాటితో పాటు  కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. వాటిని పట్టుకుని మనం చేసే మంచి పనులకి ఉపయోగించుకోవచ్చు.
ఎలా అంటే సామ దాన భేద దండోపాయాల ద్వారా.
ఇతరుల ద్వారా పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పించి తద్వారా పనులు చేయించడం సామోపాయం.
బహుమతుల వంటి పొగడ్తలతో ముంచెత్తి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం దానోపాయం.
బుద్ధి బలంతో చేయక తప్పని పరిస్థితులు కల్పించడం భేదోపాయం. 
ఇక చివర్లో దండన లేదా దండోపాయం. (దాని జోలికి అస్సలు పోకూడదు.)
 ఇలా మూర్ఖులు,దుష్టుల నుంచి పనులు చేయించడం కత్తి మీద సాము లాంటిదే.అయినా పదుగురికి మంచి జరిగే విషయంలో ఈ మాత్రం సాహసం చేయక తప్పదు. ఏమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు