వేసవి సిత్రాలు.;- తాటి కోల పద్మావతి

 మండుటెండలు కాస్తేనే కదా/
తెల్లని మల్లెలు విచ్చుకొని పరిమళాలు వెదజల్లేది/
ఎర్రటి ఎండలు చుర్రుమంటేనే కదా/
నీడ కోసం గొడుగు నెత్తిమీద ఎక్కేది/
ఎండలు నిప్పులు చెరిగితేనే కదా/
చల్లని మజ్జిగలు, ఐస్ క్రీములకు గిరాకీ పెరిగేది/
వడగాల్పులు వీస్తేనే కదా/
తాటి ముంజలు పుచ్చకాయల రుచి తెలిసేది/
మే నెల వస్తేనే కదా/
పుల్లటి మామిడికాయలు 
తియ్యదనం పంచేది/
వేసవి వస్తేనే కదా/
చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చేది/
వేసవి సెలవులు వస్తేనే కదా,/
పిల్లలకు ఆటవిడుపు అయ్యేది/
తాతయ్య అమ్మమ్మల పల్లెటూర్లకు ప్రయాణమైతేనే కదా/
చెరువులో ఈతల కొట్టడం, ఈత కాయలు తాటి ముంజలు తినడం తెలిసేది/
వేసవి వస్తేనే కదా/
మామిళ్ళతో ఆవకాయ, మాగాయ పచ్చళ్ళ పండుగ వచ్చేది,/
ఎండలు బాగా కాస్తేనే కదా/
వడియాలు ఉప్పు మిరపకాయల సందడి నిచ్చేది/
ఇంటికొచ్చిన అతిధులకు/
షర్బతులు, చల్లని పానీయాలు వగైరా అందించేది/
సాయంత్రమైతే చాలు చల్ల గాలులు వీస్తేనే కదా/
పిల్లలు పార్కులో ఆటలు ఆడుకునేది/
ఆరుబయట మంచాల మీద పడుకొని/
అమ్మమ్మ చెప్పే కథలకు,ఊ ఊ కొట్టడం, వీధి అడుగుల మీద బొమ్మలాటలు, పక్షుల కోసం మేత గింజలు, నీళ్లు పెట్టడం అవి గడపలోకి వచ్చి వాలినప్పుడు సంబరంతో గంతులు వేయడం.
ప్రతి సంవత్సరం వచ్చే ఎండాకాలం ఒక పండుగలా వచ్చి వెళ్ళిపోతుంటే ఏదో చెప్పలేని దిగులు.
ఏసీ రూములో చల్లదనం అనుభవించినా ఎండల్ని ఆస్వాదించకుండా ఉండలేము.
పల్లెల్లో వేసవి ఎంత రమణీయమో.
తాటాకు పందిళ్ళ చల్లదనపు కమ్మని వాసన ముక్కుపుటాలను తాకుతుంటే,/
వింజమరాలు ఎందుకు?
మల్లె మొగ్గలతో పూల జడలు కుట్టించుకొని ఆడపిల్లల కుచ్చుల జడలు /
దాబా పైన పండు వెన్నెల, చల్లగాలి కొబ్బరాకుల సందుల్లోంచి తొంగి చూసే చందమామ, అబ్బా! ఎంత బాగుంటుందో!
ఏ కాలానికి ఆ కాలంతో పాటు వేసవికాలం ఇచ్చే లాభనష్టాలు సుఖసంతోషాలు మానవాళికి బొమ్మ బొరుసు లాంటివి/
వేసివి తాపాన్ని తట్టుకొని బయట తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ, వడదెబ్బలు తగలకుండా ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అంతకన్నా ఏం కావాలి.
వేసవికాలం వస్తేనే కదా ఎండలు కాసేది,/
ఎండలు కాస్తేనే కదా పంటలు పండేది/
పంటలు పండితేనే కదా తిండి దొరికేది/
తిండి దొరికితేనే కదా మనిషి బ్రతికేది.
వేసవి సిత్రాలు.

కామెంట్‌లు