1️⃣
పంటపండెడి నేల
ప్లాటులయ్యెడివేళ
గింజకై వగపేల?
ఓ చిన్ని"దానా"!
2️⃣
అమెరికా "సిరికోన"
అచట పుట్టిన కూన
నిల్చు కాసుల పైన
ఓ చిన్ని"దానా"!
3️⃣
అంతరీక్షమునైన
అందకొనగల చాన
ఆమె కుములునులోన
ఓ చిన్ని"దానా"!
4️⃣
నీలిచిత్రపు ముల్లు
నీకు గుచ్చిన చెల్లు
సెల్లు ఫోనే సెల్లు!
ఓ చిన్ని"దానా"!
5️⃣
నీతి దప్పిన నాడు
నిలువగలడా రేడు
కంసుడేమైనాడు
ఓ చిన్ని"దానా"!
6️⃣
ఆవు మేయును గడ్డి
అమృతమొసగెడి గిడ్డి
సిరులు పంచే దొడ్డి!
ఓ చిన్ని"దానా"!
7️⃣
నీడనిచ్చే చెట్టు
నీకు ప్రాణము పెట్టు
వద్దు గొడ్డలి పెట్టు
ఓ చిన్ని"దానా"!
8️⃣
వందకవితలు వ్రాసి
విందు, మందును పోసి
గొప్ప కవిగా వాసి
ఓ చిన్ని"దానా"!
9️⃣
కాసులిచ్చిన కలదు
కవి గండడను బిరుదు
వ్రాయు కష్టము వలదు
ఓ చిన్ని"దానా"!
🔟
రోడ్డు గోతులు బాసు!
పట్టదెవరికి ఊసు
కాంట్రాక్టరుకు కాసు
ఓ చిన్ని"దానా"!
--------------------------------------
ఓ చిన్ని"దానా"!;- కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి