సుప్రభాత కవిత ; - బృంద
మధుమాసపు కోయిల పిలుపు
మల్లెపూల పరిమళాలతో
మావిడిపళ్ళ తీయదనంతో
మనసున కొత్త తలపులు రేపి....


ఊహల మాలల
నెత్తావి మాధురులు
ఊయలూపి మనసును
వేకువకై ఎదురుచూడమంది

వెండి వెన్నెల జలకాలాడి
సొమ్మసిల్లిన వసుధకు
కమ్మనైన తొలికిరణాల
పలకరింపు వేణుగానమాయె

సేదతీరిన మనసుతో
రెట్టింపైన ఉత్సాహంతో
దినకరుని స్వాగతించ
సిద్ధంగా నిలుచున్నది

నారింజ రంగుల తివాచీ
పైనుండి  కనుల విందుగా  
కదలి వచ్చు కరుణాంతరంగుని
కమనీయ దర్శనం పొందింది

రంగురంగుల పూలతో
నిండిన దోసిలొగ్గి
దినకరుడికి భక్తి గా
పుష్పాంజలి సమర్పించింది

పచ్చని పైరులన్నీ 
వయ్యారంగా కదులుతూ
పరవశంగా పులకరించి
పరమాత్ముని స్వాగతించె.

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు