అలజడి ...!!-----డా.జి.ఎన్.రావ్.-- హైదరాబాద్.
 ఓ..నా చెలీ ..! 
నాలో రగిలించావుకదా  
అలజడి.....!
ఎక్కడున్నావో నీవు
ఎలా తెలుసుకోనునేను !
ఉదయించే సూర్యుడినడగనా?
వాడి కిరణాలకు కంది-
ఎక్కడన్నా సోలి పడిఉన్నావేమోనని,
పయనించే గాలినడగనా ?
దాని తాపులకు ఎక్కడన్నా 
వడలి పోయావేమోనని,
పరుగిడే మబ్బుల నడగనా?
దాని వాన తాకిడికి ఎక్కడైనా 
ఒదిగి ఉన్నావేమోనని,
పారే నదిని అడగనా
దాని ప్రవాహంలో పడి
ఏ ఒడ్డుకైనా చేరావేమోనని,
అందమైన ఆ జాబిల్లి నడగనా
వాడి వెన్నెల సోయగాలకి సొమ్మసిల్లి
ఏక్కడ నిద్దరోతున్నావోనని,
అందని ఆ తారల్ని అడగనా?
వాటి తళుకులకు భయపడి
ఎక్కడన్నా దాగున్నావేమోనని,
గాలి తాకిడికే కందిపోయే నీవు!
ఎక్కడున్నావని ఎవరినడగను,
ఎప్పుడొస్తావని ఎదురు చూడను.?
నాలో ఈ అలజడికి 
ఎలా అడ్డుకట్ట  వేయను...!?

కామెంట్‌లు