చుట్టూ దంతాలు అయితేనేం...!;- - యామిజాల జగదీశ్
 ఆ రాత్రి వేళ లంకలోని వీధులలో ఆంజనేయుడు సంచరిస్తుండగా ఓ ఇంట్లో నుంచి శ్రీరామనామాన్ని పదే పదే ఉచ్చరిస్తున్న మాట వినిపించింది. ఆ రామనామ స్మరణ సన్నని స్వరంలో విన్పిస్తుండటంతో విస్తుపోయిన ఆంజనేయుడు ఆ దిశలోకి
నెమ్మదిగా చూసాడు.
రావణాసురుడు పాలిస్తున్న రాజ్యంలో 
నా రామచంద్రమూర్తి నామాన్ని పలుకుతున్నది ఎవరబ్బా అని ఆలోచించాడు ఆంజనేయుడు.
ఆ ఇంటి ఆవరణలో తులసీ మొక్కలు అనేకం ఉన్నాయి. ఇంటి గోడమీద శ్రీహరి గుర్తులు కనిపిస్తున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి ఇంటి ముందర తలుపు తెరచి పవిత్రమైన రామనామాన్ని ఉచ్చరిస్తూ బయటకు వచ్చాడు. ఆకాశంలో నక్షత్రాలు తళుకులీనుతున్నాయి. ఆ వ్యక్తి తులసిమొక్కలకు నీరు పోస్తూ రామనామాన్ని పదే పదే పలుకుతున్నాడు.
అంతే అమాంతం ఆంజనేయుడు ఆయన ముందుర వాలి చేతులు జోడించి నిల్చున్నాడు. ఆ వ్యక్తి తాను రావణాసురుడి సోదరుడు విభీషణుడు అని పరిచయం చేసుకున్నాడు. 
మీరు ఓ భక్తుడు. ఉన్నతమైన ఆత్మ అంటూనే ఆంజనేయుడు అడిగాడిలా...
"నన్ను మీ వైఖరి ఆశ్చర్యపరుస్తోంది. ఈ భూమ్మీద పిశాచాల మధ్య మీరెలా ఉంటున్నారు?" అని.
అప్పుడు విభీషణుడు చిన్న నవ్వు నవ్వి "నోట్లో ఉంటున్న నాలుకలా" అన్నాడు.
ముప్పై రెండు దంతాలూ కొరికి నములుతూ చుట్టు ఉన్నా సరే నాలుక ఎటువంటి ఆటంకమూ లేకుండా అన్ని రకాల రుచులనూ ఎలా అనుభవిస్తున్నాదో అలా నేనీ రాజ్యంలో ఉన్నా. మెత్తటి ఈ నాలుక చిన్నపాటి గాయం తగలకుండా దంతాల నుంచి ఎలా తప్పించుకుంటోందో అలానే నేనున్నా.  అది పట్టు కోల్పోతేనే  గాయపడుతుంది. నాలుక ధోరణి... వినయవిధేయతలతో అణకువగా ఉండటం దాని ప్రధాన తత్వం. అందుకే దాని ఆయుస్సు సుదీర్ఘం. దంతాల ఆయువు అట్లా కాదు. ఎలా వచ్చాయో అలానే వొక్కక్కటిగా అవి ఊడిపోతాయి. కానీ నాలుక అలాకాదు. పుట్టుక మొదలుకుని తుది శ్వాస వరకూ మనిషితోనే ఉంటుంది. 
నాలుక ప్రతి మనిషికీ నేర్పించేదదే. ఇతరులు తమ వైఖరితో మాటలతో గాయపరచవచ్చు. కానీ మనం మన నియంత్రణలో నిలకడగా వినయవిధేయతలతో  ఉంటే జీవితాన్ని ఆనుభవించొచ్చు. కాదని మనమూ పట్టు కోల్పోతే గాయపడవలసి ఉంటుంది. ఇందువల్ల మానసిక ప్రశాంతతా కోల్పోతాం. కనుక సంతోషంగా జీవితాన్ని కొనసాగించడంలో దంతాల మధ్య ఉంటున్న నాలుకలా మృదుత్వాన్ని నిలుపుకోవడం ముఖ్యం. మన మాట ఎదుటివారి హృదయాన్ని నొప్పించకూడదు. మర్యాదతో మాట్లాడాలి.చుట్టూ ఉన్న ప్రపంచం కళ్ళు మనల్ని గమనిస్తూనే ఉంటుందనే ధ్యాస ఉండాలి. మనం చెప్పే వాటలో నిజమెంతో గమనిస్తుంది. మనం స్థిరమైన సంతోషాన్ని ప్రశాంతతను కోరుకుంటున్నామంటే ఆ పాఠాన్ని నాలుక నుంచి నేర్చుకోవాలి. అలాగే బతకాలి. స్నేహంగా ఉండాలి. అణకువతో ఉండాలి. ఇందువల్ల మనతో నలుగురూ తమ బంధాన్ని కొనసాగిస్తారు.
రామరామరామ 
రామరామరామ
జయశ్రీ రాం
శ్రీరామజయం!!
శ్రీరాం జయరాం జయజయరామ!

కామెంట్‌లు