సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -99
దర్పణ ప్రతిబింబ న్యాయము
*****
దర్పణము అంటే అద్దం.ప్రతి బింబము అంటే ఒక వస్తువు యొక్క ప్రతి రూపం లేదా ఛాయ,నీడ అనే అర్థాలు ఉన్నాయి.
దర్పణ ప్రతి బింబ న్యాయము అంటే అద్దంలోని ప్రతి రూపం వలె అని అర్థం. అద్దం మోసం చేయదు.మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుందనే అర్థంతో ఈ దర్పణ ప్రతిబింబ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు . 
అసలు అద్దం ఎందుకు ఉపయోగిస్తాం. మనల్ని మనం చూసుకోవడానికేనా? వ్యక్తిగత వస్త్రధారణ సమయంలోనేనా? అలంకరణలోనా ..!. ఇందుకోసమే అయితే అద్దం గురించి అంతగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
మనం నిత్యం ఉపయోగించే అద్దాన్ని అంతరంగంగా మార్చుకొని చూద్దాం.
అప్పుడు ఏం జరుగుతుంది? మన ముఖాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తుందో,మన మనసును కూడా అంతకంటే స్పష్టంగా చూపిస్తుంది.మనం చేసే తప్పులు,ఒప్పులను కండ్లకు కట్టిస్తుంది. మనలోని మంచి గుణాలను మెచ్చుకుంటూనే,విపరీత భావాలను చిత్రిక పడుతుంది.
ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తూ  పైకి ఎంత గొప్పగా ప్రవర్తించినా అంతరంగం అనే అద్దం ముందు తలదించుకోవాల్సిందే.అందుకే వేమన ఇలా అంటాడు.
"అంతరంగమందు నపరాధములు చేసి/ మంచివానివలెనె మనుజుడుండు/ ఇతరులెరుగకున్న నీశ్వరుడెరుగడా?/ విశ్వధాభిరామ వినురవేమ."
అలా తప్పులు చేసిన వ్యక్తిని ఇతరులు త్వరగా గుర్తించలేక పోవచ్చును కానీ అంతరాత్మ అనే అద్దమునే ఇక్కడ ఈశ్వరుడుగా భావించాలి.ఎవరిని మోసం చేసినా అంతరాత్మను మోసం చేయలేం.ఆ అద్దం మనసు గల్లా పట్టుకొని నిలదీస్తుంది.చేసే తప్పులకు శిక్ష అనుభవిస్తావని  హెచ్చరిస్తుంది.
అద్దం అంతరాత్మ అనే న్యాయాధికారే కాదు. ఓ మంచి నేస్తం, హితైషి కూడా.
మనం ఏడిస్తే స్నేహితునిలా అదీ ఏడుస్తుందే తప్ప వెక్కిరించదూ,నవ్వదు.మన స్వచ్ఛమైన నవ్వుకు మురిసిపోతూ ప్రతి రూపమై మరింత స్వచ్ఛంగా నవ్వుతుంది.
అద్దం గురించి చెప్పేటప్పుడు ఫలానా వ్యక్తి మనసు అద్దం లాంటిదనీ, ఎవరైనా సూటిగా మనవైపు చూడకుండా అబద్ధాలు చెప్పే వాళ్ళ మీద అనుమానం వస్తే అంటుంటాం. "నిజం చెబుతున్నావో అబద్దం చెబుతున్నావో ఒక్క సారి అద్దంలో చూసుకో నీకే తెలుస్తుందని ".
ఇలా అద్దం మన కనిపించే ప్రతిబింబాన్నే కాదు కనిపించని హృదయాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది.
కాబట్టి రోజుకు ఒక్కసారైనా అద్దంలో మన మొహంతో పాటు మనసును తరచి తరచి చూసుకుంటే  మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెబుతుంది.నిత్యం అలా చూసుకోగలిగిన వ్యక్తి  మనిషిగా కాకుండా మానవీయ విలువల కాంతి నింపుకుని  వెలుగులు పంచుతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
 ఇదే కదా! "దర్పణ ప్రతిబింబ న్యాయమంటే"... 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు