సుప్రభాత కవిత ; - బృంద
భూమాత మెడలో
చంద్ర హారంలా తీరాన
కదులుతున్న కెరటాలు

అంతరంగ అగాధం నుండీ
తోసుకు వస్తున్న మరపురాని
తలపుల తరంగాలు

తీరం చేరాలని కెరటాల
పోరాటంలో ప్రతిసారీ
ఓటమే!

దూకుడు పెంచిన 
ప్రతిసారీ వెనక్కు
లాగేయబడ్డమే!

నిరంతరం ప్రయత్నం మాత్రం
వదలని పట్టుదల ఒక్కటే 
అలల ఆయుధం.

కడలిని కళ్ళార్పక
చూస్తున్నకొద్దీ....దొరికే
కడలేని కఠిన పాఠాలు..

మౌనంగా పిలిచే తీరాలు
పరుగులు తీసే అలల
ఊహల హోరు రాగాలు..

అంతరంగపు అగ్నిపర్వతపు
జాడలేవీ కనిపించనివ్వని
గాంభీర్యం.

అలసట తెలియని చైతన్యం
అన్నీ కడుపున దాచుకునే 
ఔదార్యం

మన లోపలి యుధ్ధాన్ని
తాను మాత్రమే
అర్థం చేసుకోగలిగే ఆత్మీయత

కడలి కడుపున కనులు తెరచే
కమ్మని ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు