సామెత కథ ; -ఎం బిందుమాధవి
  "గురివింద గింజ తన నలుపెరగదు" 
 
 తెలుగుతల్లి కెనడ.కం మాసపత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచురించబడిన కథ: 
 గురివింద గింజ పైన ఎర్రగా..కింది వైపు నల్లగా ఉంటుంది. తనకి ఉన్న లోపాన్ని గుర్తించకుండా..ఎదుటి వారిలో లోపాన్ని వెతికి...వారిని హేళన చేసే వారి విషయంలో ఈ సామెత వాడతారు. 
@@@@
 రోడ్డు యాక్సిడెంట్ లో భర్త చనిపోయాక..పిల్లలు లేని సరోజ ఒక్కతే ఉంటోంది. 
 ఉద్యోగం మానేసి తమ దగ్గరకి వచ్చి ఉండమని అన్నా..వదిన, తల్లీ తండ్రీ ఎంత చెప్పినా వెళ్ళి ఉండటానికి సరోజ ఇష్టపడలేదు. తన భర్త తో గడిపిన జ్ఞాపకాలు ఉన్న ఆ ప్రదేశం వదిలి రాలేనని చెప్పింది. 
 కానీ అసలు విషయం.... ఇప్పుడు తాత్కాలికంగా కష్టం వచ్చిందని ఉద్యోగం మానెయ్యటం లాంటి భారీ నిర్ణయాలు తీసుకుంటే..రేపు తల్లీ తండ్రి గతించాక..అన్నా..వదిన మీద ఆర్ధికంగా ఆధారపడవలసి వస్తే బతుకు దుర్భరమవ్వచ్చు అని దూరంగా ఆలోచించింది. 
 "ఏమో..ఇప్పుడు మధ్య వయస్సే..రేపు కాలం ఎదురు తిరిగి ఏ భయంకరమైన వ్యాధో సంక్రమించి వైద్యానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే... ఈ ప్రేమలు..ఆప్యాయతలు ఇలాగే ఉంటాయని నమ్మకమేముంది వదినా" అన్నది...ఆడపడుచుని ఒంటరిగా వదలలేక తమ దగ్గరకి వచ్చేయమన్న వదినతో! 
 "ఉద్యోగంలో ఉంటే పెన్షన్, మెడికల్ ఇన్స్యూరెన్సులు, ఇంకా ఇతర లాభాలు ఉంటాయి. మీ ప్రేమని నేను శంకించట్లేదు వదినా. కానీ రేపన్న రోజు ఎలా ఉంటుందో ఏం చెప్పగలం! నాకున్న ఆర్ధిక స్వావలంబన ని పోగొట్టుకోవటం తెలివైన పని కాదు. మా స్టాఫ్ కూడా అదే అంటున్నారు. నేను పూర్తి చేసిన సర్వీసు పదేళ్ళే అయినా...రాజీనామా చేస్తే అదంతా వృధా అవుతుంది" అన్నది. 
 ఇప్పుడు తాత్కాలికంగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా..ఒక సారి ఉద్యోగము, అది ఇచ్చే భరోసా..తనకున్న కాలక్షేపము దృష్టిలో ఉంచుకుని..భవిష్యత్తులో జరిగే అనూహ్యమైన పరిణామాలు ..దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం కొనసాగించాటానికే నిర్ణయించుకుంది. 
 వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో ఉండమని, కనీసం ఇద్దరు..ముగ్గురు కలిసి ఉండే పిజి లో ఉండమని శ్రేయోభిలాషులందరూ చెప్పినా... తామిద్దరూ కష్టపడి కొనుక్కున్న ఇల్లు అది..అద్దెకిచ్చి బయటికెళితే..ఆ అద్దెకొచ్చే వాళ్ళు తనకేం సమస్య సృష్టిస్తారో! తను, భర్త కలిసి గడిపిన ఆ ఇల్లుని వదలటానికి ఇష్టపడలేదు. 
 @@@@
 తను పని చేసే కాలేజికి నాలుగు రోజులు సెలవలు వస్తే మరొక రెండు రోజులు తను సెలవు పెట్టి అన్నగారింటికి వచ్చింది సరోజ. 
 అప్పుడప్పుడు అలా వచ్చి ఉండటం అలవాటే. 
 "సరూ మా ఫ్రెండ్ కూతురి పెళ్ళి. రెడీ అవ్వు..వెళదాం" అన్నది మహతి. 
 "నువ్వెళ్ళు వదినా..నేను రాను.. టీవీలో సినిమా చూస్తున్నాను" అన్నది. 
 "ఒక్క దాన్నే ఏం వెళతాను. మీ అన్నయ్య కూడా ఆఫీసులో పనుంది రానన్నారు. సరదాగా వెళ్ళొద్దాం పద. ఒక గంటే! సినిమా వచ్చాక చూడచ్చులే..ఎలాగూ నెట్ ఫ్లిక్సే కదా" అని ఆడపడుచుని బలవంతంగా బయలుదేర దీసింది. 
 కళ్యాణ మంటపం...అలంకరణ..పెళ్ళికొచ్చిన వారి కార్లు..వారి వస్త్రధారణ..అలంకరణ..నగలు వారి హోదాని చెప్పకనే చెబుతున్నాయి. 
 మహతికి..పెళ్ళి కూతురు తల్లి వింధ్య బాల్య స్నేహితురాలు. బాగా ఆత్మీయురాలు. చాలా కాలంగా దుబాయి లో ఉండి ఈ మధ్యనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. 
 గుర్తు పట్టటాలు..పలకరింపులు అనే లాంఛనాలతో సంబంధం లేకుండా... వస్తూనే లోపలికి చొచ్చుకుని సరాసరి పెళ్ళి కూతురి గదిలోకి వెళ్ళిపోయింది మహతి. 
 "రావే..మహతీ ఇప్పుడా రావటం..రా..రా..ఆలస్యం అవుతోంది. నువ్వే వచ్చి పెళ్ళి కూతురిని చేస్తానని చెప్పావ్!  సరిలే...పద పద.. బుగ్గన చుక్క, కాళ్ళకి పారాణి అయినా పెట్టు" అని గడ గడా మాట్లాడేస్తూ.. "మీ ఆడపడుచా..." అని సందేహంగా మొహం పెట్టి..."ఆ మధ్య భర్త చనిపోయాడని చెప్పావు..ఆమేనా ఈమె" అని అసహనంగా.. సన్నగా గొణిగింది. 
 సరోజని చూడగానే వింధ్య మొహంలో రంగులు మారటం..ఆ తరువాత ఈ వ్యాఖ్య ద్వారా ఆమె ఆంతర్యం అర్ధం చేసుకున్న సరోజ ఆ గదిలోంచి వెంటనే బయటికి వచ్చింది. 
 ఆమె కళ్ళల్లో కదలాడిన సన్నటి నీటి పొర మహతి దృష్టిలో పడింది. 
 సరోజ వెనకే బయటికి రాబోతున్న మహతిని..చేతులు పట్టి లాగి.."టైమైపోతోందే..త్వరగా పారాణి పెట్టు..గౌరీ పూజకి కూర్చో పెట్టాలి"..అని శరవేగంతో బయటికెళ్ళి పోయింది వింధ్య. 
 @@@@
 చిన్న మొహం చేసుకుని అన్యమనస్కంగా పందిట్లో ఒక్కతే కూర్చున్న సరోజ దగ్గరకి..వింధ్య దూరపు చుట్టం వరలక్ష్మి వచ్చి..పలకరించి..పరిచయం చేసుకుంది. 
 పెళ్ళి కూతురు అలంకరణ పూర్తి చేసి వచ్చిన మహతి.."సారీ సరూ..ఇలా జరుగుతుందనుకోలేదు. నువ్వు రానంటుంటే నేనే బలవంత పెట్టి తీసుకొచ్చి..నిన్ను అవమానానికి గురి చేసినట్టయింది" అన్నది నొచ్చుకుంటున్నట్టు మహతి. 
 "పోనీలే వదినా..శుభకార్యం కదా..ఆవిడకి అలా అనిపించిందేమో! వదిలెయ్..నువ్వేం బాధ పడకు..ఇందులో నీ తప్పేం లేదు" అని వదినకి సర్ది చెబుతుంటే..
 పక్కనే ఉన్న వింధ్య చుట్టం వరలక్ష్మి ..కలగ జేసుకుని.."అదంతే నమ్మా.. తొందరపడి మాట్లాడేస్తుంది. ముందూ..వెనకా చూసుకోదు. అయినా ఆయన కాలం చేసి ఎన్నాళ్ళయింది" అన్నది ఆరాగా! 
 "ఏడాది దాటి పోయిందండి. ఎక్కడికి వెళ్ళకుండా ఎన్నాళ్ళు ఇంట్లోనే బందీ అవుతారు? అసలు వాళ్ళు చెయ్యని తప్పుకి ఎందుకు బందీ అవ్వాలి? ఇదే మగవారైతే ఇలాగే మాట్లాడతారా? ఆడవాళ్ళకో న్యాయం..మగ వారికో న్యాయమా" 
 "ఉద్యోగాలకి వెళ్ళట్లేదా? ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ చాదస్తాలేంటండి? ఆడా..మగా అందరూ పెద్ద చదువులు చదివి..పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా చుట్టపెట్టి వస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మాత్రం 'ఎక్కడేసిన గొంగళి అక్కడే' అన్నట్టుంది మన ఆలోచన" అన్నది ఆడపడుచుకి ఎదురైన అనుభవానికి నొచ్చుకుంటున్నట్టు మహతి. 
 "వదిలెయ్ వదినా" అంది సరోజ.
 @@@@
 వింధ్య చుట్టం.. వరలక్ష్మి తన కూతురిని తమ్ముడికిచ్చి చేసింది. కూతురు పుట్టిన పదేళ్ళకి పుట్టిన కొడుకు అపురూపం ఆవిడకి. 
 భార్యా భర్తలిద్దరు కొడుకుని గారాబంగా కళ్ళల్లో పెట్టుకు పెంచారు. 
 చదువయ్యాక మంచి ఉద్యోగంలో చేరిన కొడుక్కి పెళ్ళి కుదిరింది. పెళ్ళి ఇంకా రెణ్ణెల్లు ఉందనగానే విఘ్నేశ్వరుడికి మీదు కట్టి పెళ్ళి పనులు మొదలుపెట్టారు. కోడలికి చీరలు, నగలు కొనే పనిలో ఉండగా..ఆవిడ తమ్ముడు విష జ్వరంతో చనిపోయాడు. తమ్ముడే అల్లుడు కూడా అవుతాడు ఆవిడకి. 
 పొరుగూరులో జరిగిన ఈ సంఘటనకి వెంటనే వెళ్ళి చూసి, కూతురిని ఓదార్చి.. కొడుకు పెళ్ళి పనులు చూసుకోవాలని వచ్చేసింది. 
 "అదేంటమ్మా..కన్న తల్లై ఉండి..అలా చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోవటమేంటి? ఇంత కష్టం వచ్చినప్పుడు కూతురుకి తోడుగా ఉండద్దా? ఎంత కఠినాత్మురాలైనా తల్లి అలా ఉంటుందా" అని అమ్మలక్కలందరూ ముక్కున వేలేసుకున్నారు. 
 "కొడుకు పెళ్ళి కుదిరిందటమ్మా..పెద్దెత్తు సంబంధంట! ఆవిడకి పట్ట పగ్గాల్లేవు. ఆ కొడుకు ముందు..కూతురు పట్ల ఆవిడ బాధ్యత, ప్రేమ రెండో పక్షమే" అన్నది..వీరి కుటుంబ విషయాలు తెలిసిన రామలక్ష్మి. 
 @@@@
 వింధ్య మాటలు, చేతలతో చిన్నబుచ్చుకుని ఒంటరిగా కూర్చున్న సరోజని కావాలని పలకరించి పరిచయం చేసుకున్న వరలక్ష్మి..ఊరుకోకుండా వింధ్య గురించి సరోజతో చేసిన వ్యాఖ్య పక్కనే కూర్చున్న రామలక్ష్మి విన్నది. 
 "ఆ:( ఈవిడ గారినే చెప్పాలి.. ఏదో పెద్ద ఆధునికురాలిలాగా తీర్పు చెప్పటానికి వచ్చింది! ఈవిడ తన కూతురి విషయంలో ఎలా ప్రవర్తించిందో మాకందరికీ తెలుసు. ఆ రోజున అందరూ ముక్కున వేలేసుకోవడమే!" అన్నది. 
 "ఏం జరిగిందేమిటి?" అన్నది ఇంకొక గాసిప్పుల రాణి. 
 "ఈ వరలక్ష్మి..తన కూతురిని తమ్ముడికే ఇచ్చి చేసింది. దురదృష్టవశాత్తూ తమ్ముడు చనిపోయి..కూతురు విధవరాలైతే వెళ్ళి చూసి వెంటనే వచ్చేసింది. పదో రోజు తను వెళ్ళకుండా భర్తని పంపించింది. వాళ్ళబ్బాయి పెళ్ళికి మీదు కట్టాక వెళ్ళకూడదని ఎవరో చెప్పారుట.."
 "కొడుక్కి...కాబోయే కోడలికి మంచిది కాదని...స్వంత కూతురు అనే అనుబంధం కంటే తమ్ముడు భార్య అనే చుట్టరికానికే ఆవిడ ప్రాధాన్యం ఇచ్చింది. కూతురికి వచ్చిన కష్టం ఆవిడని కదిలించలేదు. బయటి వాళ్ళు అనేసరికి తీర్పులు చెప్పటానికి సిద్ధమై పోతారు." అన్నది రామలక్ష్మి. 
 "ఇలా కూడా ఉంటారా అండి" అన్నది మరొక కాలక్షేపం కబుర్ల ఇల్లాలు..వీరి సంభాషణలో తల దూర్చి. 
 'ఇలాంటి వారిని చూసే "గురివింద గింజకి తన కింద ఉండే నలుపు తెలియదు" అంటారు పెద్దలు' అన్నది పక్కన ఉన్న ఇంకొక ఇల్లాలు. 
 "పోనీ లెండి.. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సందర్భాల్లో మనుషులు ఎలా ఆలోచిస్తారో తెలిసింది. వదినా నువ్వు వచ్చేస్తే...పాపం మీ ఫ్రెండ్ నొచ్చుకుంటుంది. నేను వెళుతున్నాను. ఇంట్లో వంట చేశావు కదా! నేను భోజనం చేసి సినిమా చూడటం కంటిన్యూ చేస్తాను. పెళ్ళి అయ్యాక భోజనం చేసి నిదానంగా రా" అని చెప్పి బయలుదేరింది సరోజ. 
 "ఎవ్వరినీ తప్పు పట్టని సంస్కార వంతురాలు మా ఆడపడుచు. పాపం.. తనకే ఇటువంటి అనుభవం జరిగింది" అని వింధ్య పిలిస్తే లోపలికి వెళ్ళింది మహతి! 

కామెంట్‌లు