కొడుకులు - అపురూప నరకులు;- శిరందాస్ శ్రీనివాస్
పుత్రుడి జననం 
పున్నామ నరకం నుండి 
తప్పిస్తుంది అని పురాణాలు చెబుతాయి..
బతికుండగానే 
పున్నామ నరకం చూయించే
పుత్రుడు పుడితే ఎంత ?
గిడితే ఎంత?

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా
విశ్వదాభిరామ.. వినుర వేమ...!
అన్నాడు వేమన ఏనాడో...

పుత్రుడు పుట్టగానే 
ఆ తండ్రి ఎంత మురిసిపోతాడో 
వంశాంకురం జన్మించాడని.
అలాంటి నలుగురు కొమరులు
పుట్టినంత నేనే దశరథ మహారాజుని ఆన్న గర్వం తొణికిసలాడుతుంది. 

చనిపోతే మోయడానికి
ఆ నలుగురు కావాలి
ఆ నలుగురు నా కడుపున పుట్ట 
నాకేంటి కొదవ అని విర్ర వీగుతాడు.

పొట్ట గట్టుకొని చెమటోడ్చి
తన కష్ట సుఖాలు మరచి
పస్తులుండి ప్రయోజకుల చేయ
అహరహం శ్రమించి
ఆస్తులెన్నో కూడబెట్టి
అపురూపంగా పెంచ 
ఆ కొడుకులే అప్రయోజకులై
అపురూప నరకులై
పున్నామ నరకమే
పుడమిపై చూయించ 
పుడితే ఎంత గిడితే ఎంత?

పెళ్ళామే బెళ్ళమై
అమ్మా నాన్నలు అల్లమై
మెడలు పట్టి బయటికి గెట్టగా
కన్న కలలు కళ్ళలై
కళ్ళు బైర్లు గమ్మి
పట్ట పగలు చుక్కలు కనిపించే
ఆ చుక్కల వెలుగులో 
తన బతుకు చిత్రం కనిపించే..

కట్టుకున్న పెళ్ళాం కాలం చేస్తే
కనికరమే లేని కోడలు పట్టెడు అన్నం పెట్ట మనసు రాదాయే
కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే
కుండలో నీళ్ళే దిక్కాయే..

నలుగురు కొడుకులు ఆస్తులే కాదు
అయ్యనీ పంచుకుండ్రు..
తలో నెల బతికుండగానే 
కంచం లో పిండం పెట్టడానికి.. 

అది చూసి మనసు వికలమై
అంతరంగం చెప్పె అర్ధాంగిని చేరమని. 
తన చితిని తాను పేర్చుకొని
తనువు చాలించే సగటు మనిషి. 

భూమి గుండ్రమని తెలియదా 
మిడిసి పడే పుత్ర రత్నాలకు..
తమకూ ఓ రోజు ఆరోజు వస్తుందని
ఆ రోజు ఎంతో దూరం లేదని..


కామెంట్‌లు
*BSN* చెప్పారు…

చాలా అద్భుతంగా వర్ణించారు, కానీ ఇంకా ఏదో కొత్తతనం ఉంటే బాగుండునేమొ అనిపించింది.🙏
అజ్ఞాత చెప్పారు…
అక్కరకు రాని కొడుకుల గురించి చాలా బాగా వర్ణించారు ధన్యవాదములు🌹🙏

సుతులు లేకుంటే సద్గతి లేదనిరి గాని తాను
దన్యుండైన తనయులేల శుక మునీంద్రుడు సతీ
సుతుల నార్జించక వ్యర్తుడై పోయెనా వసుధలోనా
ధృతరాష్ట్రునకు దండి సుతులు నూరుగురుండి
తాముద్ధరించిరా తండ్రి నెల్ల కనుక కొరగాని
సంతులున్నను ఫలమేమి అవనిలోన!