మంచి - చెడు; -: సి.హెచ్.సాయిప్రతాప్
 హస్తినాపురంలో కౌరవులు, పాండవులు కొలువుదీరి ఉన్నారు. అదే సమయంలో ఒక మహర్షి కొలువుకు వచ్చారు. ఆయనను ఇరుపక్షాలు సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చెసారు. దర్బారులో వున్నవారికి కొన్ని హితోక్తులు చెప్పసాగారు. ఏది మంచో, ఏది చెడో, ఎవరు మంచివాళ్లో, ఎలాంటి వాళ్లు చెడ్డవాళ్లో వివరించాడు. ఆయన మాటలతో ఏకీభవించలేనట్టు ముఖం పెట్టాడు దుర్యోధనుడు. మీవన్నీ పనికిరాని మాటలు. ఈ యుగంలో ఆచరించదగినవికానేకావు అని చిటపటలాడాడు. అప్పుడు మహర్షి ధర్మరాజుతో ‘నాయనా! నువ్వు ఈ నగరమంతా పర్యటించి నీకంటే చెడ్డవాడు అనిపించినవాడిని వెతికి పట్టుకొని ఈ సభకు తీసుకురా!’ అన్నారు.
తర్వాత ఆ మహర్షి దుర్యోధనుడితో ‘నువ్వు నగరంలో పర్యటించి నీ కంతే మంచివాడు అనిపించిన ఒక వ్యక్తిని ఎలాగైనాసరే వెదికి పట్టుకొని తీసుకురా!’ అని చెప్పారు. ధర్మరాజు, దుర్యోధనులిద్దరూ సభ నుంచి వెంతనే బయల్దేరారు. సాయంత్రానికి ఇద్దరూ తిరిగి సభా సదనానికి చేరుకున్నారు. ఇద్దరితోపాటు వేరెవరూ లేరు.ఒంతరిగా బయలుదేరినవారు తిరిగి ఒంటరిగానే తిరిగి వచ్చారు.‘ఇద్దరూ ఒంటరిగా వచ్చారేం?’ అని ప్రశ్నించారు మహర్షి. అప్పుడు ధర్మరాజు ‘మహర్షీ! ఈ నగరంలో నాకు నాకంటే చెడ్డవాడూ అయినవాడు ఒక్కరూ కనిపించలేదు. అందరూ మంచివాళ్లే’ అన్నాడు. ‘నాకైతే నాకంటే ఒక్క మంచివాడూ తారసపడలేదు. అందరూ దుష్టులే!’ అన్నాడు దుర్యోధనుడు. మహర్షి చిన్నగా నవ్వి ‘మీ దృష్టిని బట్టి లోకం ఉంటుంది. ధర్మరాజు లోకమంతా మంచిదే అని భావించాడు. అందరిలో మంచినే చూశాడు. అందుకే
అతనికి చెడ్డవాడు కనిపించలేదు’ అన్నాడు. ‘దుర్యోధనా! నీ దృష్టిలో ఈ లోకమంతా చెడ్డదే! అందుకే ఎంత వెతికినా నీకు మంచివాడు కనిపించలేదు’ అన్నాడు.  మనం నల్లని కండ్లద్దాలు పెట్టుకుంటే మన పరిసరాలు నల్లగానే కనిపిస్తాయి. ప్రతీ వ్యక్తిలో మంచి-చెడు రెండూ ఉంటాయి. మనలోని చెడును జయించి మంచిగా మారడమే మనిషి కర్తవ్యం. అదే సమయంలో ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించడం సమదృష్టికి సోపానం.
మంచితనం అనే భావనలోనుంచి వచ్చే ప్రతి తలంపు, వివిధ స్థాయిల్లో పక్షపాతాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకదాన్ని మంచిదిగానూ, మరొకదాన్ని చెడ్డదిగానూ చూడడం మొదలుపెడతారో, మీ గ్రాహ్యత పూర్తిగా వక్రీకరించ బడుతుంది. మీరు దానినుంచి బయటపడే అవకాశమే లేదు. మీరు ఎంత గట్టిగా కృషి చేసినా, అది అలాగే కనబడుతుంది. దీనిని విచ్చిన్నం చేయడానికే, యోగా అని సద్గురు జగ్గీవాసుదేవ్ అద్భుతంగా వివరించారు.
వీటినే సనాతన ధర్మం, ధర్మం మరియు అధర్మంలుగా విభాగించింది. మనము ఏవిధంగా రాజ్యాంగం రాసుకొన్నట్లే అందరికి తెలిసేటట్లు రాసుకున్నారు. అప్పుడే ప్రతివారికి ఏది తప్పో మరియు ఏది ఒప్పో తెలుస్తుంది.
ధర్మమూ/మంచి అధర్మము/చెడ్డ అనేవి సమాజాల్లో ఒక క్రమాన్ని తీసుకురావటానికి అంటే బలహీనులను బలవంతులనుండీ కాపాడటానికే పెట్టినవే అని గ్రహిస్తే చాలు.అందుకే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. కాబట్టి మంచి చెడు అనేవి బొమ్మ బొరుసు లాంటివి.. ప్రతి ఒక్కరు మంచినైనా, చెడు నైనా స్వీకరించక తప్పదు, అయితే నేరుచుకునే సమయంలో మంచిని మాత్రమే స్వీకరించి, చెడును వదిలివేయాలను మన పెద్దలు చెబుతుంటారు.

కామెంట్‌లు