సుప్రభాత కవిత ; - బృంద
తుషార శీతల సరోవరాన
ఉషోదయ వేళ 
వినిపించు భూపాలం

మగత నిదురలో చలించే
అలల కదలికల 
ఆనందభైరవి

గలగలమను ఆకుల అల్లరిని
ఆపలేని కొమ్మల 
కల్యాణి మురిపాలు

చురుకుగా తాకు
కిరణాల వేడికి
పలికే కానడ

వీడని చలికీ
ఆగని వేడికీ మధ్య
కదనకుతూహలం

దూరాన శిఖరాలనుండీ
చల్లగ సాగే మలయమారుతాల
మాయామాళవ గౌళం

పాలమబ్బుల పరుగు చూసి
నింగి పాడే జాలి రాగాల
సింధుభైరవి

అడుగులకు తోడుగా 
తలపులు పాడే
తోడి రాగం

కనులకు విందైన
కమనీయ దృశ్యం  చూసి
మనసు పాడే మోహన

ఆగమించు ఉదయానికి
హంసధ్వనితో ఆహ్వానం

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు