దినసరి కూలి(మణిపూసలు);- -పి. చైతన్య భారతి
పొట్టకింత కూడులేక 
చేతినిండ పనేలేక 
ఆకలి వెంటాడుతూంటె
పట్నానికే వస్తిమిక!

కూడలిలో నిలుచుంటిమి 
కూలికొరకే వెదికితిమి 
జానెడు పొట్టకొరకు 
గుంపులుగా చూస్తుంటిమి!

ఇటుకబట్టీ పనిలోను 
కాంక్రీటూ దుమ్ములోను 
పేగులన్ని మెలిపెట్టగ
కారుచౌక కూలినేను!

ఎత్తైనా భవనాలను 
కాంతులీను రంగులను
ఆకలినే అదిమిపట్టి 
అలవోకగ కట్టెతాను!

భద్రతకే దిక్కులేదు 
భవితకేమొ దారిలేదు
కుటుంబాన్ని సాకలేని 
కన్నీళ్లకు అంతులేదు!

శతాబ్దాల ఉక్రోషం 
బానిసత్వ ఆవేశం 
బడబాగ్నిల మసలుకొనిరి
నిరుపేదలు ప్రతినిమిషం!

కొల్లగొట్టె శక్తినంత
మాయదారి మనుషులంత
జాలిలేని బడబాబులు 
దౌర్జన్యమె వారిపంత!

పుట్టెడు అప్పుల బాధలు 
కాలమె గడవని తిప్పలు 
సంసారమెట్లు సాగునో.. 
చీకటి కమ్మిన బతుకులు !

తలరాతలే మారునని 
కలగనిరి భవిష్యత్తుని 
ప్రజాస్వామ్య పాలనలో 
కడగండ్లూ తొలగేనని! 

ఓటడిగితె వాతపెట్టు 
నోటిస్తే తరిమికొట్టు 
అభివృద్ధిని ప్రశ్నించి 
ఓటుతోనె చురకపెట్టు!

కామెంట్‌లు