సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -143
పూర్ణ ఘట న్యాయము
*****
పూర్ణ అంటే నిండుగా ఉన్న అని అర్థం.ఘటము అంటే కుండ లేదా కడవ.పూర్ణ ఘటము అంటే నిండు కుండ అని అర్థం.
 "నిండు కుండ తొణకదు" అంటే నిండైన వ్యక్తిత్వం దేనికీ తొందరపడకుండా సంయమనంతో ఉంటుందనే అర్థంతో ఈ "పూర్ణ ఘట న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అలాంటి మంచి వారిని గురించి  వేమన రాసిన పద్యం చూద్దాం.
" నిండు నదులు పారు నిల్చి గంభీరమై/ వెఱ్ఱి వాగు పారు వేగ బొర్లి/ అల్పుడాడు రీతి నధికుండు నాడునా/ విశ్వధాభిరామ వినురవేమ!"
అంటే నిండు కుండలు ఎప్పుడూ తొణకవు. ఎలాగంటే బాగా నీటితో ఉండే నదులు గంభీరంగా ప్రవహిస్తూ ఉంటాయి.కానీ నీళ్ళు లేని వెర్రి వాగులు మాత్రం వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి కదా!. అదే విధంగా అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ సజ్జనులు మితంగా, విలువైన రీతిలో మాట్లాడుతూ ఉంటారని  దీని అర్థం.
కొందరి మాటలు, చేతలు మృదు మధురంగా ఉంటాయి. ఇతరులు ఆవేశం కలిగించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకారు.తొందరపడి నోరు జారరు.ఇలాంటి వారినే  "అన్ని ఉన్న  ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది " అనే సామెతతో  పోలుస్తుంటారు.
అంటే అన్ని తెలిసిన వారేమో ఎంతో వినయంగా వుంటే, సగం, సగం తెలిసిన వారేమో మిడిసిపడుతూ అందరి ముందు తామే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తారని పై సామెత యొక్క అర్థం.
అన్ని తెలిసిన వారిలోని మరో సుగుణం ఏమిటంటే 'తమకు తెలిసిన విషయమే ఐనా,ఎదుటి వారు చెబుతున్నప్పుడు, తమకు తెలుసని వారించకుండా ఓపికతో వింటారు.
 
అందుకే పెద్దలనే మరో మాట "అన్నీ తెలిసిన వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు. కానీ తెలిసీ తెలియని వాళ్ళకి ఏమీ చెప్పలేము " అని
'పూర్ణ ఘట న్యాయానికి'  సంబంధించిన సుభాషిత శ్లోకాన్ని కూడా ఓ సారి చూద్దాం...
"సంపూర్ణ కుంభో న కరోతి శబ్ద మర్థఘటో ఘోషము పైతి నూనం/విద్వాన్ కులీనో న కరోతి గర్వం మూఢాస్తు జల్పన్తి గుణైర్విహీనాః!!"
అర్థం ఏమిటంటే సంపూర్ణ కుంభం అనగా నీటితో నిండుగా ఉన్న కుండ ఎలాంటి శబ్దమూ చేయదు.దానిలోని నీరూ తొణికిసలాడదు. అదే సగం నీటితో నింపబడిన కుండలోని నీరు శబ్దం చేస్తూ బాగా తొణికిసలాడుతుంది.
దీనినే వ్యక్తులకు వర్తింప చేస్తే' మంచి విలువలు కలిగిన వ్యక్తి గానీ, అన్నీ తెలిసిన విద్వాంసుడు కానీ ఉన్నతమైన విలువలను పాటిస్తూ ఇతరులతో మంచిగా ఉంటాడు.గర్వం లేకుండా,గొప్పలకు పోకుండా అందరితో కలిసి మెలిసి ఉంటాడు. అలాంటి వ్యక్తిని 'నిండుకుండ'లాంటి వాడనీ,'నిండుకుండ తొణకదు' అని అంటుంటారు.
ఇలా జ్ఞానము,సంపద ఎంతున్నా విర్రవీగకుండా, వినయంగా ఉన్న వారిని  "పూర్ణ ఘట న్యాయము"తో పోల్చడం సరిగ్గా సరిపోతుంది కదా! మీరేమంటారు?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు