సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -144
ప్రపా మేలన న్యాయము
*****
ప్రపా అంటే చలిపందిరి, బాట సారులు జలము తాగు చోటు అంటే చలివేంద్రము.మేలనము అంటే కలయిక, సమాజము మిశ్రణము అని అర్థం.
ఎక్కడెక్కడి వారో చలి వేంద్రంలో జల పానార్థమై అంటే నీళ్ళు తాగడానికి వచ్చి  ఆ కొద్ది సేపు కలుస్తారు. దప్ఫిక తీర్చుకున్న తర్వాత తిరిగి ఎవరి త్రోవన వారు పోతుంటారు.అలా అనుకోకుండా  కలుస్తూ,విడిపోతూ ఉండటాన్ని 'ప్రపా మేలన న్యాయము'అంటారు.
ఉదాహరణకు నదీ ప్రవాహములో కొట్టుకొచ్చిన పుల్లల వలె, సత్రాలలో కలిసే జనుల వలె.
దీనినే బంధాలకు వర్తింప చేస్తే "ఋణ సంబంధముచే ఒకచోట కలిసే తండ్రి, తల్లి,కుమారుని వలె"అని అర్థంతోనూ ఈ న్యాయమును వర్తింప చేస్తారు.
"ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః అనే సూక్తి శ్లోకం భాగవత పురాణంలోని చిత్ర కేతు ఉపాఖ్యానం లోనిది.
 "ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః/ ఋణ క్షయే క్షయం యాంతి!కా తత్ర పరి దేవనా!! ...ఆ కథ ఏమిటో చూద్దాం."
శూరసేన దేశానికి రాజైన చిత్రకేతునికి సంతానం చాలా కాలం కలుగలేదు. ఎంతో మందిని వివాహం  చేసుకున్నాడు.అయినా సంతానం కలగలేదు. అంగీరస మహర్షి సూచన ప్రకారం పుత్ర కామేష్టి యాగం చేయడం, అనంతరం రాజుకు పుత్రుడు జన్మిస్తాడు.
లేకలేక పుట్టిన ఆ పుత్రుని మోహంలో పడి రాజ్యాన్ని, తాను వివాహం చేసుకున్న ఇతర రాణులను పట్టించుకోకుండా కాలం గడప సాగాడు.
ఇదంతా కంటగింపుగా మారి ఇతర రాణులు కలిసి ఆ బాలుడికి విషం పెట్టి చంపేస్తారు.
రాజ దంపతులు మరణించిన కొడుకు కోసం కన్నీరు మున్నీరుగా  విలపిస్తూ ఉంటే అంగీరస మహర్షి నారదునితో కలిసి వచ్చి పై సూక్తి శ్లోకం లోని మాటలు అంటాడు..."పశువులు, పత్నులు,కుమారులు, గృహాలు ఇవన్నీ మానవ జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. ఈ మోహ వికారాన్ని వదిలి మనసును స్థిరంగా ఉంచుకో''  అంటాడు.
కూడా వచ్చిన నారదుడు   మరణించిన బాలుడి బంధం గురించి కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైన మాటలు చెప్పడంతో చిత్రకేతునికి మోహ వికారాలు తొలగిపోతాయి.
ఈ విధంగా పశువులు, భార్య, పుత్రులు మొదలైన వారు.ఇండ్లూ,వాకిండ్లు.. ఇవన్నీ ఋణానుబంధ రూపముగా వచ్చి, ఋణము తీరగానే మనిషిని వదిలిపోతుంటాయని పెద్దలు ఆధ్యాత్మిక చింతనతో అంటుంటారు.
దీనినే మనం 'జీవితమొక రైలు ప్రయాణం'అని కూడా అనవచ్చు.
ఎందుకంటే మన బతుకు ప్రయాణము మొదలైనప్పటి నుంచీ  ప్రయాణము ముగించే వరకు ఎన్నో బంధాలు , అనుబంధాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగిన వారు కలుస్తూ,పరిచయమవుతూ,విడి పోతూ ఉంటారు. 
కొన్ని బంధాల వల్ల ఖేదం, మరికొన్ని బంధాల వల్ల మోదం కలుగుతూ ఉంటుంది.ఎవరి స్టేషన్ రాగానే వారు వెళ్ళిపోతారు.
చివరికి మనమైనా అంతేగా అనుకునే అర్థంలో ఈ" ప్రపా మేలన న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు