సత్ప్రవర్తన; - సి.హెచ్.సాయిప్రతాప్
 దేవద్విజగురుప్రాజ్ఞ
పూజనం శౌచం ఆర్జవమ్।
బ్రహ్మచర్యం అహింసా చ
శారీరం తప ఉచ్యతే ॥
కేవలం భగవంతుని ధ్యానిస్తూ చేసేది మాత్రమే తపస్సు కాదు! సత్ప్రవర్తన కూడా ఒక విధమైన తపస్సువంటిదే. దేవతలను, జ్ఞానులను, గురువులను, అనుభవజ్ఞులను పూజించడం; శరీరాన్ని శుచిగా, శుభ్రంగా ఉంచుకోవడం; నిరాడంబరత; అహింస... వంటి పద్ధతులన్నీ శరీరంతో చేసే తపస్సుకి సూచనలుగా చెప్పబడుతున్నాయి.
పొగత్రాగటం, మద్యాన్ని సేవించటం, పేకాట ఆడటం, వ్యభిచరించటం, అబద్ధాలాడటం, మోసగించటం, దొంగతనం చేయటం, దురుసుగా మాట్లాడటం, దౌర్జన్యం చేయటం, అక్రమంగా సంపాదించటం, ఇవన్నీ దురలవాట్లనీ, ఆ అలవాట్లున్న వారు దుష్టులు, దుర్మార్గులు అని, అలాంటి వారితో కలసి తిరగటం దుష్ట సాంగత్యము అంటుంటారు.ఇటువంటి దుష్ట సాంగత్యం వలన మన సద్గుణాలు అడుగంటిపోయి చెడు గుణాలు అలవరచుకొని నీచ స్థితికి దిగజారుతాము.
మానవ సేవయే మాధవ సేవ! అన్నది ఆర్యోక్తి,
పేదవారిని సేవించడం, మరియు అవసరం ఉన్నవారికి దానధర్మాలు చెయ్యడం వల్ల, భగవంతుడి అనుగ్రహాన్నీ పొందగలము.ఆందరిలో ఉన్న భగవంతుడిని గుర్తించి ,సేవ చేసుకునే అవకాశాన్ని పొందగలగడం గొప్ప వరం. ఏదీ ఆశించకుండా సేవ చేసే వారు ఏదీ కోరుకుండానే జీవితంలో ఉత్తమైనవన్నీ పొందుతారు.
సత్ప్రవర్తన మానవుణ్ణి అన్ని విధాలా తప్పక రక్షిస్తుంది.  సత్ప్రవర్తన లేని మానవుడు రాక్షసుడనబడుతున్నాడు. మంచి శీలం కలవాడు ఓర్పు, దయ, శాంతము, వినయము, భక్తి, గురువుల వద్ద గౌరవము అహింస సద్భావము, ఇంద్రియనిగ్రహము, తృప్తి సదాచారం ఇటువంటి మంచి గుణాలు కలిగివుంటారు.
సత్ప్రవర్తన వల్ల సుఖం లాభం, కీర్తి, శాంతి, జ్ఞానం, దైవానుగ్రహం కలుగుతాయి. సౌశీల్యంగల వారు సమాజంలో గౌరవింపబడతారు. పూజించబడతారు. సౌశీల్యం  వారికి ఎక్కడా ఎదురుండదు. పరలోకంలో ఉత్తమగతిని పొందవచ్చు. కాబట్టి మానవులు సౌశీల్యమును కలిగివుండాలి అని పెద్దల ఉవాచ.


కామెంట్‌లు