కలియుగ వైపరీత్యం: సి.హెచ్.సాయిప్రతాప్

 కలియుగం ఆరంభం అయ్యాక ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి. మానవులలో పవిత్రత నశిస్తున్నది. కలియుగం యొక్క ప్రధాన లక్షణం మానవులు  పవిత్రకర్మలు చేయనివారై ప్రతివారూ దురాచారములయందు రతులై ఉంటారు. సత్యవాక్కు పట్ల విముఖత్వం కలిగి ఉంటారు. సత్యము అంటే జరిగినది జరిగినట్లు చెప్పడమే కాదు త్రికాలములలోనూ నిలిచి ఉండు శాస్త్రవిషయము అని అర్థం. శాస్త్ర విషయములయందు విముఖులై ఉంటారు. పరులపై నిందలు చేస్తూ, ఆ నిందలే కాలక్షేపాలుగా వెళ్తూ ఉంటారు. పరద్రవ్యములమీద, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. పరహింసా పరాయణులై ఉంటారు. ఇంతకు ముందు యుగాలలో నిషేధించినట్టు చెప్పబడుతున్న అనేక అంశాలనే ఈ కలియుగంలో చేయడానికి ఇష్టపడుతుంటారు.బ్రాహ్మణులు తాము చేయవలసిన కర్మలు విడిచిపెట్టి పరులను వంచిస్తూ తిరుగుతూంటారు. త్రికాలసంధ్యావందనాలు విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానము లేకుండా ఉంటారు. వేదాధ్యయనం అంటే ఒక ఆషామాషీ వ్యవహారంలా వుంటుంది. పాలకులు  స్వధర్మాన్ని విడిచిపెట్టి అసత్పురుషులతో సాంగత్యం చేస్తూ పాపరతులై, ఉంటారు. వీరిలో శూరత్వం పూర్తిగా లోపించి యుద్ధం అనగానే వెనకడుగు వేస్తారు.
గాలి, గాలి, వేడి, వర్షం, మంచు వల్ల ప్రజలు తీవ్రమైన బాధలు అనుభవిస్తారు. అనుక్షణం మానవులు అనారోగ్యాలతో, మానసిక ఆందోళనలతో బాధలు అనుభవిస్తుంటారు.  కలియుగంలో మనిషి జీవిత కాలం 50 సంవత్సరాలు మాత్రమే వుంటుంది.  వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు అసలు పట్టించుకోరు.
మతం, నిజాయితీ, పరిశుభ్రత, సహనం, దయ, జీవించే కాలం, శారీరక బలం, జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకూ క్షీణిస్తాయి. శక్తిమంతమైన కలి ప్రభావమే దీనికి కారణం.

కామెంట్‌లు