సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -145
ప్రదీప న్యాయము
*******
ప్రదీపము అంటే దీపము, దివ్వె.
దీపం వెలిగించడానికి ఉపయోగించే ప్రమిదను సాధారణంగా మట్టితో చేస్తారు.మరి దీపం వెలగాలంటే అందులో వత్తి, నూనె ఉండాలి. మరి వత్తి ,ప్రమిద, నూనె, అగ్ని ఒకే కోవకు చెందినవి కావని మనకు తెలుసు. ఐనా అవి కలిసి చీకట్లను పోగొట్టి వెలుగును పంచి లోకానికి ఉపకారం చేస్తాయి.అంటే పరస్పర విరోధులే అయినా లోకోపకారము కోసం అందరూ కలిసి ఒక మంచి పనిని చేయవచ్చనే అర్థంతో అర్థంతో ఈ 'ప్రదీప న్యాయము'ను ఉదాహరణగా చెబుతుంటారు.
మట్టి అంటే పంచభూతాల్లో ఒకటైన భూమి.మన దేహం కూడా పంచభూతాల నిర్మితం. కాబట్టి దీపపు ప్రమిదను మన శరీరానికి ప్రతీకగా,అగ్నిని మనలో వెలిగే జీవంగా చెబుతుంటారు.
అంటే విరుద్ధమైన వాటిని ఒక చోట చేర్చి వాటిని సమాజ,స్వంత శ్రేయస్సుకు, అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశం ఈ న్యాయములో ఇమిడి ఉంది.
ఒక సాధారణ ఉదాహరణ చెప్పుకుందాం.ఆకలి తీర్చుకోవాలి/ భోజనం చేయాలి అంటే ఆహార పదార్థాలతో కూడిన వంట కావాలి.అందులో ఉపయోగించే పదార్థాలు ఒకటే కోవకు చెందినవి కావని మనందరికీ తెలుసు. వాటన్నింటినీ ఒక చోట చేర్చి తిన యోగ్యమైన వంటకాలుగా తయారు చేసుకుని, ఆకలి తీర్చుకుంటున్నాం.
పంచభూతాలు పరస్పర విరుద్ధ గుణాలను కలిగి ఉన్నాయి. నిప్పును నీరు ఆర్పేస్తుంది. గాలి నిప్పును రగిలేలా చేస్తుంది.మట్టిపై జీవం పుట్టుక కావాలంటే తగుమాత్రం వేడి కావాలి, అవసరమైన నీరు కావాలి. ఆ జీవుల ఊపిరికి వాయువు కావాలి. ఆ గాలి కదలడానికి శూన్యాకాశం కావాలి. ఇవన్నీ కలిస్తేనే జీవుల జీవనం.మానవ మనుగడ.
ఇక దీపానికి సంబంధించిన  ఆధ్మాత్మిక భావనతో కూడిన శ్లోకం చూద్దాం. 
 
"వర్తి ర్ధేహో కర్మ తైలం/ జ్యోతిరాత్మేతి చింతయేత్/అధ కర్పూర కీలావత్/ భవేన్ని శ్శేషతావధి/ అంటారు
అంటే వత్తి దేహం,కర్మే తైలం,దీపమే ఆత్మగా భావించాలి.ఆ తర్వాత కర్పూర జ్వాలలాగా ఏమీ మిగలకుండా జ్యోతిలో లీనమై పోవాలి అని అర్థం.
 ఇక దీపం వెలగడానికి నువ్వులు పోస్తే వెలుగదు.నూనె పోస్తేనే వెలుగుతుంది.అలాగే  జ్ఞాన దీపం వెలగాలంటే  ఏం చేయాలో వేమన పద్యాన్ని చూద్దాం.
కర్మ గుణములన్ని కడబెట్టి నడువక/ తత్వమేల తనకు తగులు కొనును/ నూనె లేని దివ్వె నువ్వుల మండునా/ విశ్వధాభిరామ వినురవేమ"
చెడు కర్మలను, చెడు ఆలోచనలను తీసేసి నడవాలి.అప్పుడే తత్వం అంటుకుంటుంది. దీపం నూనెతో మండుతుంది కానీ నువ్వులతో కాదు కదా!
భావ జాలం ఎలా ఉన్నా ఒక మంచి పని, సమాజ హితం కోసం కలిసి పనిచేయడం వల్ల లోకానికి మేలు జరుగుతుందని ఈ ప్రదీప న్యాయము వలన తెలుసుకోగలిగాం.
దీపం గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన రెండు మాటలు చెప్పుకుందాం.
"నేను అస్తమించిన తర్వాత నా పని నిర్వర్తించేది ఎవరు? "అని ప్రశ్నించాడట సాయంకాల సూర్యుడు. "నేనా పని చేస్తాను". అని బదులిచ్చిందట చిన్ని సంధ్యా దీపం.మరి ఈ చిన్న జీవితాన్ని ఓ మంచి వెలుగుల దివ్వెగా మార్చుకుందామా!  
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు