సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -147
ప్రాసాద వాసి న్యాయము
*****
ప్రాసాదము అంటే దేవాలయం,రాజ భవనము,నగరు,దేవ గృహము అనే అర్థాలు,వాసి అంటే  బాడిస,వాశి,కాపురముండు వాడు అనే అర్థాలు ఉన్నాయి.
ప్రాసాద వాసి అంటే  రాజగృహము లేదా  మేడలో కాపురం ఉండే వాడు అని అర్థం.
మేడలో ఉన్న వారు పొద్దస్తమానం, రేయింబవళ్ళు మేడల్లోనే  ఉండరు,కింద కూడా ఉంటారు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అంటే మనిషికి  ధనధాన్యాలు, వస్తు సంపద, మేడలు, మిద్దెలు ఎన్ని ఉన్నా అవి చెప్పుకోవడానికి, సుఖంగా జీవించడానికే, కానీ నేల నొదిలి గాలిలో నడవలేడు కదా!
ఐనా కొందరిలో అహం. కాలికి మట్టి అంటకుండా మేడలు మిద్దెల్లో ఉంటున్నామని.అలా ఎంత అహంకరించినా,హుంకరించినా ఆఖరి నివాసం ఈ భూమ్మీదే.
అలా గర్వంతో విర్రవీగే వారిని ఉద్దేశించి  వేమన  ఏం రాశారో చూద్దాం.
 ఏమి  గొంచు వచ్చె నేమితా గొనిపోవు/ బుట్టువేళ నరుడు గిట్టు వేళ/ ధనము లెచటికేగు దానెచ్చటికి నేగు విశ్వధాభిరామ వినురవేమ "
అనగా  మనిషి పుట్టినప్పుడు తనతో ఏమీ తీసుకుని రాలేదు.చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేడు.చివరికి తానెక్కడికి పోతాడో, సంపాదించిన సంపదలు ఎటు పోతాయో  తెలియదు. 'మరి ఎందుకలా అహంకారంతో ప్రవర్తించాలి. ఒక్కసారి తిరిగి చూసుకో! ఆలోచన చేయి' అనే అర్థం ఈ పద్యంలో ఉంది.
గొప్ప సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నాననీ గర్వించడం కాదు. ఈ నేల మీద ఎవరూ శాశ్వతం కాదు.అహాన్ని వీడి, అసలైన శాశ్వతత్వం ఏమిటో తెలుసుకోవాలి.
 ఆకాశంలో విహరించే పక్షియైనా నేల మీదకి దిగే ఆహారం సంపాదించుకుంటుంది. భూమి మీద పెరిగిన చెట్టును ఆశ్రయించి గూడు కట్టుకుని కాపురం ఉంటుంది.
ప్రాసాద వాసి యని మురిసి పోవడం,గర్వపడటం కాదు ప్రపంచంలోకి ప్రవేశించిన మనం,గర్వపడే మంచి పనులు చేసి ప్రజల నాలుకలపై నడయాడాలి, మనసుల్లో నివసించాలి అనే అర్థంతో ఈ "ప్రాసాద వాసి న్యాయము" సరిగా సరిపోతుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు